మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ ఈ సారి కూడా సమాజానికి మంచి సందేశం ఇవ్వనున్నారు. రాజకీయ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో “భరత్ అనే నేను” (Bharat Anne Nenu)సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి నుంచి విభిన్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ని ఫస్ట్ ఓత్ పేరిట జనవరి 26 న రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. నేటి ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణంతో అదరగొట్టారు. టీజర్ ని “భరత్ విజన్” పేరిట రిలీజ్ చేసి ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే సినిమాకి అసలైన ప్రచారాన్ని కూడా కొత్తగా ప్లాన్ చేసినట్టు తెలిసింది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు.
ఈ షెడ్యూల్లో కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ నెల చివరినాటికి షూటింగును పూర్తి చేయనున్నారు. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించాలని కొరటాల భావిస్తున్నారు. ఈ ప్రమోషన్ రిలీజ్ డేట్ (20 ) వరకూ సాగనుంది. ప్రతి రోజూ ఒక్కోరకంగా ప్రమోషన్స్ ఉండేలా ప్లాన్ చేసారని సమాచారం. మహేశ్ ఏర్పాటు చేసుకున్న కొత్త టీమ్, ఈ ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. 20 రోజుల పాటు కొనసాగే ఈ ప్రమోషన్స్ .. సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో అపజయం చూసిన మహేష్ ఈ సినిమా ద్వారా హిట్ ట్రాక్ లోకి రావడానికి కష్టపడుతున్నారు.