చాలా రోజుల క్రితం ఊళ్లలో ఒకే సినిమా రెండు థియేటర్లలో పడినప్పుడు ఎంతటి సందడి చేసేవారో గుర్తుందా? మా దగ్గరే సినిమా చూడండి అంటూ బ్యానర్లు, పోస్టర్లు పడేవి. రెండు థియేటర్లు వేర్వేరు పోస్టర్లు వేసేవారు. ఆ తర్వాత ఒకేసారి ఒకే సినిమా రెండు టీవీ ఛానల్స్‌లో ఫస్ట్‌టైమ్ వచ్చినప్పుడు జరిగిన హంగామా గుర్తుందా? నాగార్జున సినిమా ‘రక్షకుడు’ అయితే ఇలానే ఒకేసారి రెండు టీవీ ఛానల్స్‌లో వచ్చింది. ఓటీటీ వచ్చాక ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు.
కానీ ‘భీమ్లా నాయక్’తో అలాంటి హంగామా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలతో ఈ సినిమా రూపొందింది. మాలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ సినిమాకిది రీమేక్. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఏపీలో ప్రభుత్వం అనధికారిక ఆంక్షలు ఉన్నప్పటికీ మంచి వసూళ్లే సాధించింది. తెలంగాణలో ఎప్పటిలానే మంచి వసూళ్లు వచ్చాయి.
సినిమా వచ్చిన సుమారు నెల రోజుల తర్వాత ఓటీటీకి వచ్చింది. అది కూడా ఒక ఓటీటీ కాదు, ఒకేసారి రెండు ఓటీటీల్లో. ఇలా చాలా తక్కువ సినిమాలకే జరుగుతూ ఉంటుంది. ఆ రెండు ఓటీటీలు ఏంటో మీకు తెలిసిందే. ఒకటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అయితే, రెండోది ఆహా. ఈ రెండూ ప్రస్తుతం తెలుగులో తమ జోరు చూపిస్తున్నాయి. దీంతో ప్రజల్లోకి ఈ సినిమాను పంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ మా దగ్గరే చూడండి అంటూ ప్రచారం చేస్తున్నాయి.
ఓవైపు ‘ఆహా’ టీమ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. దీంతో ‘భీమ్లా నాయక్’ అనగానే ఆహాలో ఉంది అనేలా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ‘లా లా భీమ్లా ’ అనే మాటను ‘ఆహాలా భీమ్లా’ మార్చేసి.. తెలుగు ప్రజలకు బాగా కనెక్ట్ అయిపోయింది. దానికి తోడు సౌండ్, పిక్చర్ క్వాలిటీ విషయంలో నాణ్యత పెంచి, కొత్త అనుభూతిని ఇస్తోంది. హాట్ స్టార్ కూడా అదేస్థాయిలో ప్రచారం చేస్తోంది. హైదరాబాద్‌లో స్పెషల్ బ్యానర్లు, కటౌట్లు వస్తున్నాయి. ట్యాంక్‌బండ్ మీద ‘భీమ్లా స్పెషల్ కటౌట్’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా రెండు ఓటీటీల మధ్య ప్రచారం, పోరు బాగుంది.