సినిమా రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూడట ఆనవాయితీ. కానీ ఒక సినిమా రిలీజ్ డేట్ ఆ సినిమా బృందమే ఎదురుచూస్తోంది అంటే ఆసక్తికరమే కదా. అలాంటి పరిస్థితినే ఇప్పుడు ఎదుర్కుంటోంది ‘భీమ్లా నాయక్’ బృందం. అవును సినిమాను ముందు అనుకున్నట్లు ఫిబ్రవరి 25న విడుదల చేస్తాం, లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేస్తే… సినిమా ప్రచారం మొదలెడతామని అనుకుంటోంది చిత్రబృందం. విచిత్రంగా ఉంది కదూ.
సంక్రాంతికి తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్న చిత్రబృందం… త్వరత్వరగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉండింది. సరిగ్గా అదే సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ వచ్చి మిగిలిన సినిమాలను వెనక్కి నెట్టేసింది. దీంతో కొంచెం దీమాగా సినిమాను పూర్తి చేసుకుందాం అనుకున్నారు. ఫిబ్రవరి 25 అనే డేట్ ఇచ్చేసరికి… ఓ రెండు వారాల ముందు ప్రచారం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఏ ఫిబ్రవరి 11 తర్వాత ప్రచారం షురూ చేద్దాం అనుకొని ట్రైలర్ కూడా కట్ చేసి పెట్టుకున్నారట. ఇప్పుడు చూస్తే ఆ డేట్ కూడా డౌట్‌లో పడింది. దీంతో రిలీజ్ డేట్ కోసం చిత్రబృందం కూడా ఎదురు చూస్తోందట.
సినిమా కోసం చిత్రబృందం సుమారు 140 సెకన్ల ట్రైలర్‌ను సిద్ధం చేసిందట. ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని ఎదురుచూస్తోందట. వస్తే యూట్యూబ్ దద్దరిల్లిపోవడం పక్కా అని అంటున్నారు. అయితే ఏప్రిల్ 1న సినిమా అంటే ఫిబ్రవరి 11న ట్రైలర్ రిలీజ్ చేస్తే మరీ ఎర్లీ అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకాస్త లేట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ రిలీజ్ డేట్ అంటే ఫిబ్రవరి 25కి దగ్గర్లో పరిస్థితులు కుదుటపడితే వెంటనే ప్రచారం కిక్‌స్టార్ట్ చేసి సినిమాను విడుదల చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి చిత్రబృందానికి ముందు గొయ్యి వెనుక నుయ్యి లా ఉందట.
ఒక సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రేక్షకులతోపాటు టీమ్ కూడా వెయిట్ చేయడం పెద్ద విషయమే. మొన్నీమధ్య డేట్ గురించి అడిగితే ఏపీ సీఎం జగనే చెప్పాలి అని నిర్మాత అన్నారట. ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఈ కారణంగానే పెద్ద సినిమాలు విడుదలకు ముందుకు రావడం లేదు.