టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ప్రసాద్ వి పాట్లూరి(పివిపి) ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే విజయవాడ వైసీపీ నేత మరియు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన పివిపి.. భూ వివాదంలో చిక్కుకున్నాడట. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ వద్ద ఉన్న భూమి విషయంలో ఇతన్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో పివిపి ఇంటి పక్కనే.. కైలాష్ విక్రం అనే వ్యక్తి తన ఇంటిని నిర్మించుకోడానికి ప్రయత్నించాడట. అయితే కైలాష్ పై పివిపి అనుచరులు కొందరు దాడి చేసినట్టు తెలుస్తుంది.
ఈ విషయం పై బాధితుడు కైలాష్ మాట్లాడుతూ.. ‘ ‘రూఫ్ టాప్ గార్డెన్’ ను కడితే కూల్చేస్తానని పివిపి నాకు వార్నింగ్ ఇచ్చాడు.నేను రెండేళ్ల క్రితమే ఆ ఇంటిని కొనుగోలు చేశాను. ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. అయితే సరిగ్గా.. 6 నెలల క్రితం పివిపి నాకు ఫోన్ చేసి బెదిరించారు. మంగళవారం రోజున పివిపి ఇంటికి వచ్చి మరీ నాకు వార్నింగ్ ఇచ్చాడు.’అయితే నేను కొనుకున్న ఇంట్లో.. నేను ఏం చెయ్యాలనుకుంటే.. నీకెందుకు? అది నా ఇష్టం’ అని నేను పివిపితో చెప్పాను. దాంతో బుధవారం నాడు ఉదయం 40 మందితో వచ్చి దౌర్జన్యం చేసాడు.
ఇంటిపైకి వెళ్లి.. ‘రూఫ్ టాప్ గార్డెన్’ ను కూల్చేయడం ప్రారంభించాడు. దాంతో నేను వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ చెయ్యడంతో వారొచ్చి అడ్డుకున్నారు.మా ఇంటి వెనుకే.. పివిపి ఇల్లు ఉంది. ఆయన ఇల్లు సరిగా కనిపించదనే ఉద్దేశంతోనే పివిపి ఇలా చేశారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తన వద్ద కూడా ఉన్నాయని పివిపి చెబుతున్నాడట. ఇక ‘పివిపి’ .. మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’ ‘మహర్షి’ వంటి చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే.