బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సినిమా వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లోకల్‌బాయ్ నానీ, బయ్యా సన్నీ యాదవ్.. హర్ష సాయి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వైజాగ్ లోకల్ బాయ్ నానిని ఇప్పటికే పోలీసులు రిమాండుకు తరలించడం జరిగింది. అలాగే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వీళ్ళపై మాత్రమే కాదు.. మరో 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం జరిగింది. ఈ లిస్టులో విష్ణుప్రియ, సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
ఎక్కువ శాతం వీళ్ళను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ.. “ఎంతోమంది యువకుల జీవితాలను బెట్టింగ్ యాప్స్ నాశనం చేస్తున్నాయి. అరచేతిలో స్వర్గం చూపించి షార్ట్ కట్లో కోట్లు సంపాదించాలనే.. కోరికని రేకెత్తించి ఎంతో మంది యువకుల విలువైన సమయం వృధా చేయడమే కాకుండా డబ్బులు పోగొట్టుకున్నవారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
వీరి కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి.. వారి అకౌంట్‌లను రిపోర్ట్ చేయండంటూ” ట్వీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఆ 11 మంది సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? వాళ్ళ పై పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.