సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న ఛావా (Chhaava) బాక్సాఫీస్‌ను ఊహించని విధంగా షేక్ చేస్తోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, విడుదలైన ప్రతీ చోటా సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో అయితే ఇది స్పష్టంగా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ హవా సౌత్ లో కూడా కొనసాగనుంది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌తోనే రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, తెలుగులో కూడా విడుదల కానుంది.
గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగు డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకుని మార్చి 7న ఛావాను గ్రాండ్ రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి తెలుగు బాక్సాఫీస్‌పై ఉంది. ఇప్పటికే హిందీలో ఇంతగా విజయం సాధించడంతో, దక్షిణాదిలో కూడా అదే రేంజ్‌లో వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, ఛావా ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లోనే రూ.555.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
కేవలం ఇండియాలోనే రూ.484.3 కోట్లు వసూలు చేసింది. తొలి వారం లోనే రూ.300 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం, రెండో వారంలో స్పీడ్ పెంచి 500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లు రాబడుతుండటంతో ఫైనల్ రన్‌లో ఏ స్థాయిలో నిలుస్తుందో చూడాలి. ఛావా చిత్రంలో బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) యేసుబాయి పాత్రలో ఆకట్టుకుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్‌కు పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో, సినిమా బాక్సాఫీస్‌పై మరింత ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. అలాగే అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఔరంగజేబ్ పాత్రకు న్యాయం చేశాడు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లోనే హవా చూపించిన ఛావా, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.