చిరంజీవి (Chiranjeevi) స్ఫూర్తిగా సినిమాల్లోకి వచ్చాం అని చెప్పిన వాళ్లను చూసుంటారు. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది కనిపిస్తారు. మరి చిరంజీవి స్ఫూర్తిగా సేవా రంగంలోకి వచ్చాం అని చెప్పిన వాళ్లను చూశారా? మాకు తెలిసి ఇలాంటి వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. పెద్దగా ఈ రకం చర్చ టాలీవుడ్‌లో జరిగింది కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ మాటను ఓ స్టార్ హీరో చెప్పారు. అది కూడా తమిళ స్టార్ చెప్పారు. చెప్పింది ఎవరో కాదు ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య (Suriya).
సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ స్టేజీ మీదే సూర్య తన ‘అగరం’ ఫౌండేషన్ గురించి మాట్లాడారు. పేద విద్యార్థులు, విద్యను పొందలేని వారి కోసం సూర్య అగరం ఫౌండేషన్ గత 15 ఏళ్లుగా సేవలు అందిస్తోందనే విషయం తెలిసిందే. సూర్య ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెనుక ఉన్నది చిరంజీవి అట. చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్ఫూర్తితోనే అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేశాను అని సూర్య చెప్పుకొచ్చాడు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్ఫూర్తితో ‘అగరం’ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. అయితే ఇన్నాళ్లూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించేలా ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం సినిమా అభిమానులే అని చెప్పాడు సూర్య. తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎనిమిది వేల మంది పట్టభద్రులు అయ్యారని ఆనందంగా చెప్పాడు సూర్య. ఆరేడేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ విరాళాల సేకరణకు అమెరికా వెళ్తే 30శాతానికి పైగా ఫండ్‌ని తెలుగు కమ్యూనిటీకి చెందిన విద్యార్థులే ఇచ్చారని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
ఆ విద్యార్థులు ఇప్పటికీ తమ ఫౌండేషన్‌కి సాయం చేస్తున్నారని, తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను అని సూర్య చెప్పుకొచ్చాడు. రెట్రో కథాంశంతో రూపొందిన ‘రెట్రో’ సినిమా మే 1న విడుదల కానుంది. ‘కంగువా’ (Kanguva) దారుణమైన ఫలితాన్నిచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఫలితం సూర్యకు కీలకం.
ఆగరం ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తి#Retro #Suriya #VijayDeverakonda #PoojaHegde #KarthikSubbaraj pic.twitter.com/r3mvZ0M16W
— Filmy Focus (@FilmyFocus) April 26, 2025