సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి దూకుడు మాములుగా లేదు. ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా కరోనా, ఇతర కారణాల వలన ఆలస్యమైంది కానీ.. దీని తరువాత మాత్రం ఆయన ఒప్పుకున్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ ఇలా మూడు సినిమాల షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొంటున్నారు చిరంజీవి. దీంతో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమా ఓకే చేశారు.
‘ఆచార్య’తో కలుపుకుంటే ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు లెక్క. ఈ వయసులో ఇంత బిజీగా ఉంటూ ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారని చిరంజీవిని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయనొక షాకింగ్ విషయం చెప్పారు. తాను కొత్తగా మరో ఐదు సినిమాలు కమిట్ అయినట్లు వెల్లడించారు. ఇలా విరామం లేకుండా సినిమాలు చేయడం తనకేమీ కష్టంగా అనిపించడం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తన చేతుల్లో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారని..
కానీ ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు రెడీ అవుతున్నాయని అన్నారు. ఎంతో పుణ్యం చేసుకున్నందుకే సినిమా రంగంలోకి వచ్చామని.. ఇక్కడకి వచ్చి నిలదొక్కుకున్న తరువాత ఎంత సంతోషిస్తామో.. ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధపడతామని అన్నారు. కాబట్టి మన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కష్టపడాల్సిందేనని చెప్పారు. రోజంతా పని చేసినా.. తనకు విసుగు రాదని.. తన కష్టమే తనకు ఆరోగ్యవంతుడిని చేస్తుందని అన్నారు.
‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం రాత్రి పూట పని చేశామని.. కానీ ఎక్కడా విసిగిపోలేదని అన్నారు. మరింత ఉత్సాహం వస్తుందని తెలిపారు. మొత్తానికి చిరు మరో ఐదు సినిమాలు కమిట్ అయ్యానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.