థియేటర్లు తెరుచుకుని తిరిగి సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ప్రేక్షకులు కూడా కరోనాని లెక్క చెయ్యకుండా ఎగబడి థియేటర్లకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట చిన్నా చితకా సినిమాలను విడుదల చేసి 3 నెలల తరువాత పెద్ద సినిమాలను రంగంలోకి దింపాలని.. చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో వరుసగా తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. మళ్ళీ చివరి నిమిషంలో థియేటర్ల కొరత ఏర్పడకుండా.. ముందు జాగ్రత్తగా వారు ఇలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఒక్క రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల రిలీజ్ డేట్ లు తప్ప మిగిలిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను అధికారికంగా ప్రకటించేసారు. ఇదే సమయంలో ఓ గమ్మత్తైన విషయం ఒకటి ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’, రాంచరణ్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రాలు ఒకే తేదీకి విడుదలవుతుండడం విశేషం. అలా అని ఈ 3 బడా చిత్రాలు ఒకే నెలలో విడుదలవుతున్నాయి అని కాదు.
‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతుండగా.. ‘పుష్ప’ చిత్రం ఆగష్ట్ 13న విడుదల కాబోతుంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదలవుతుంది. ఈ ముగ్గురు స్టార్స్ ఒకే డేట్ ను టార్గెట్ చెయ్యడమెంటా అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి.ఒకేవేళ సెంటిమెంట్ ప్రకారమే ఇలా చేసుంటారు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.