ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లలో అమలు చేస్తున్న టికెట్ రేట్ల వల్ల భారీ సినిమాల నిర్మాతలు ఊహించని స్థాయిలో నష్టపోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టికెట్ ధరలు అంతకంతకూ పెరుగుతుంటే ఏపీలో మాత్రం పదేళ్ల క్రితం నాటి టికెట్ రేట్లు అమలవుతూ ఉండటంతో థియేటర్ల ఓనర్లు స్వచ్చందంగా థియేటర్లను మూసివేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన టికెట్ రేట్లతో థియేటర్లను నడపలేమని థియేటర్ల ఓనర్లు చెబుతున్నారు.
టాలీవుడ్ హీరోలు నాని, సిద్దార్థ్ టికెట్ రేట్ల సమస్య గురించి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు కొన్ని థియేటర్లలో మరీ తక్కువగా ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో సీఎం జగన్ ను స్వయంగా కలిసి టికెట్ ధరల తగ్గింపు గురించి ప్రభుత్వం పునరాలోచించాలని చిరంజీవి కోరనున్నారని బోగట్టా.
తెలంగాణ సీఎం కేసీఆర్ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఆ సమస్యలను పరిష్కరించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించి టికెట్ రేట్ల సమస్యకు ముగింపు పలకాలని చిరంజీవి భావిస్తున్నారని బోగట్టా. టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల వల్ల ఏపీలోని ప్రముఖ థియేటర్లు సైతం మూతబడుతున్నాయి.
చిరంజీవి ఎంట్రీతో సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది తను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ చిరంజీవి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవైపు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.