కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ (Vikram) సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ సినిమా కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. కష్టమైన పాత్రలను సైతం అలవోకగా చేసే ప్రతిభ విక్రమ్ సొంతం కాగా విక్రమ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో కాశీ మూవీ ఒకటి. ఈ సినిమాలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం. ఈ సినిమాలోని నటనకు విక్రమ్ కు అవార్డులు సైతం వచ్చాయి.
Vikram
సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడం అంటే నాకు చాలా ఇష్టమని విక్రమ్ తెలిపారు. ఇతరులతో పోలిస్తే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అది అందరూ చేసినట్లు ఉండకూడదని విక్రమ్ పేర్కొన్నారు. నేను మందు తాగనని సిగరెట్ కాల్చనని అయితే సినిమా విషయంలో నాకున్న అభిరుచి నాకు విషంలాంటిదని విక్రమ్ వెల్లడించారు. నేను బాగా నటించాలని అనుకున్న సమయంలో అది మరింత విషంగా మారుతుందని విక్రమ్ తెలిపారు.
కాశీ మూవీలో నటించిన తర్వాత నా కంటిచూపు మందగించిందని విక్రమ్ (Vikram) అన్నారు. ఆ సమయంలో సరిగ్గా చూడలేకపోయేవాడినని విక్రమ్ అన్నారు. ఆ సినిమాలో అంధుడిగా కనిపించడం వల్ల కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చిందని ఆ ప్రభావం నా కంటిచూపుపై పడిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని విక్రమ్ తెలిపారు. ఐ సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు తగ్గానని విక్రమ్ పేర్కొన్నారు.
అదే విషయాన్ని డాక్టర్ కు చెబితే బరువు తగ్గాలనుకునే విషయాన్ని కొంచెం తేలికగా తీసుకోవాలని ఎక్కువ ఉత్సాహపడిపోవద్దని చెప్పారని విక్రమ్ వెల్లడించారు. ఇంకా బరువు తగ్గాలని ప్రయత్నిస్తే ప్రధాన అవయవాలు పని చేయడం మానేయొచ్చని వైద్యులు చెప్పారని విక్రమ్ పేర్కొన్నారు. ఆ మాటతో బరువు తగ్గడం ఆపేశానని విక్రమ్ అన్నారు.