రీమేక్, ఫ్రీమేక్, కాపీ, స్ఫూర్తి.. ఇలా పేర్లు ఏవైనా ఎక్కడో ఉన్న, రాసిన, తీసిన కథలను మరోసారి, మరో దగ్గర తెరకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. అయితే ఒకప్పుడు ఏదైనా నవల, కథ సినిమాగా తీస్తే ముందే చెప్పేసేవారు. కొన్నాళ్ల తర్వాత సినిమా టైటిల్ కార్డ్స్‌లో వేసి ఆ విషయం చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ సినిమా రీమేక్ అని, లేదంటే ఏదో కథ / నవల నుండి తీసుకున్నాం అని చెప్పడం లేదు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత ‘ఇది ఆ సినిమా కదా, ఆ నవల ఆధారంగా సినిమా చేశారు కదా’ అని అనుకునే పరిస్థితి. దీంతో ‘చెప్పి తీయొచ్చు కదా.. ఎందుకిలా చేస్తున్నారు?’ అనే ప్రశ్న మొదలైంది. తాజాగా ఓ కొత్త సినిమాకు సంబంధించి ఇదే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ హీరో సినిమాకు ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే హీరో సినిమా ‘కాపీ’ మరక అందుకుంది.
ఆ హీరోనే నాని (Nani) , ఆ సినిమానే ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ, విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమా తెలుగు నవలను స్ఫూర్తిగా తీసుకొని, కాస్త అప్‌డేట్ చేసి రాసుకున్న కథ అని అంటున్నారు. నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’.. ప్రముఖ రచయిత మల్లాది కృష్ణమూర్తి రాసిన ‘శనివారం నాది’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అని పుకారు.
‘శనివారం నాది’ నవలలో ఆ హీరో ప్రతి శనివారం ఒక అనూహ్యమైన పని చేస్తాడట. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్ర అది. మంగళ అనే మహిళా పోలీసు ఆ నవలలో కీలక పాత్రధారి. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ అదే పరిస్థితి. అయితే నవల హక్కులు తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. లేక స్ఫూర్తి అంటారా అనేది చూడాలి. నాని గత సినిమా ‘హాయ్ నాన్న’ (Hi Nanna) కథ కూడా ఏదో పాత సినిమా స్ఫూర్తి అని అప్పట్లో వార్తలొచ్చాయి.