పొరపాటున అన్న మాటల్ని క్షమించొచ్చు కానీ… నోటికొచ్చింది అనేసేవాళ్లను క్షమించకూడదు అంటారు పెద్దలు. అలా ఇటీవల కాలంలో నోటికొచ్చింద ఏదేదో వాగేసి నెటిజన్ల నుండి, సెలబ్రిటీల నుండి చివాట్లు తిన్న వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్. నటుడిగా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఇటీవల ‘లియో’ సినిమా సక్సెస్ మీట్‌లో త్రిష గురించి కొన్ని కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. అయితే ఈ వ్యవహారంలో విచిత్రంగా కోర్టుమెట్లు ఎక్కిన ఆయనకు చివాట్లు పడ్డాయి.
త్రిష గురించి మన్సూర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ నటులు చిరంజీవి, ఖుష్బూ స్పందించారు. ఇది సరైన చర్య కాదు, అలా అని ఉండాల్సింది కాదు అంటూ చెప్పారు. అయితే వాళ్లు అలా అనడం వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందంటూ మద్రాస్ హైకోర్టులో మన్సూర్ ఇటీవల పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. ఈ క్రమంలో మన్సూర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మన్సూర్ ప్రవర్తనను న్యాయస్థానం తప్పుబట్టింది.
అంతేకాదు నిజానికి మన్సూర్‌పై త్రిష ఈ కేసు నమోదు చేయాలని తెలిపింది. పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద ఓ నటిపై మన్సూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, పబ్లిక్‌లో ఎలా మాట్లాడాలో తనకు తెలుసు అనడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. తరచూ వివాదాల్లో నిలుస్తున్న మన్సూర్ తిరిగి, తనను తాను అమాయకుడిగా చెప్పుకోవడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే ఆయన మాటల వీడియోను కోర్టుకు సమర్పించమని న్యాయమూర్తి ఆదేశించారు.
దీంతో మన్సూర్ (Mansoor Ali Khan) వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను త్వరలోనే న్యాయస్థానానికి అందజేస్తామని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. అలాగే, త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా తమ వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ‘లియో’ సక్సెస్ మీట్‌లో మన్సూర్ మాట్లాడుతూ ‘‘గతంలో ఎన్నో రేప్ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.