సినిమా పరిశ్రమలో ఓ ముసలం రేగిన విషయం తెలిసిందే. వేతనాల కోసం సినీ కార్మికులు సమ్మెకి దిగారు. జీతాలు పెంచే వరకు పని చేసేది లేదు అని తేల్చేశారు. ఈ విషయంలో తొలుత చర్చలు స్టార్ట్ చేసే సానుకూల ఆలోచనలో కనిపించిన ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ఏదో విషయం తాడోపేడో తేల్చేలా కనిపిస్తోంది. అనుమతి లేకుండా నిర్మాతలు చిత్రీకరణలు చేయకూడదని స్ట్రాంగ్‌గా సూచించింది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. స్టూడియోలు చిత్రీకరణలు లేక వెలవెలబోతున్నాయి.
కార్మిక శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం చర్చలు జరగనున్నాయి. అయితే ఈ రోజు చిత్రీకరణలకు అడ్డంకులు తొలగకపోతే రెండు రకాల ఇబ్బందులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఒకటి సినిమాల విడుదల తేదీల్లో మార్పులు కాగా, రెండోది ఏకంగా సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలిపోయే అవకాశం. ఈ డౌట్ మేం క్రియేట్ చేసేది కాదు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పిన మాట. ఈ విషయం తేలకపోతే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తుంది అని విశ్వప్రసాద్ చెప్పారు. ఆయన ఉద్దేశం ఏదైనా ఇండస్ట్రీ తరలింపు ఆలోచన ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి.
ఇక ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకుని చిత్రీకరణ జరుపుకుంటున్న చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా, ప్రభాస్ ‘ది రాజాసాబ్, రామ్‌చరణ్ ‘పెద్ది’, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’, నాని ‘ప్యారడైజ్’, రవితేజ ‘మాస్ జాతర’, కిశోర్ తిరుమల సినిమా, తేజ సజ్జా – మంచు మనోజ్ ‘మిరాయ్’, మహేశ్‌బాబు – రాజమౌళి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాతోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి. వీరిలో సినిమా ఆఖరి దశలోకి వచ్చినవారు పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
పరిస్థితి ఇలా ఉన్న ఈ సందర్భంలో టాలీవుడ్ యాక్టివ్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ను కలిసే పనిలో పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం అమరావతి వెళ్లి కేఎల్ నారాయణ, రవి శంకర్, విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్నా దత్, వంశీ, వివేక్ కూచిభొట్ల, దానయ్య, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బన్ని వాసు కలుస్తారని సమాచారం.