ట్రైలర్ చూసి సినిమా కథ చెప్పేస్తుంటారు మన సినిమా జనాలు. అంతేకాదు ఆ సినిమాలా ఉంది, ఈ సినిమాలా ఉంది అంటూ లెక్కలు కూడా వేసేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే ‘దసరా’. ఏంటి నాని పాన్ ఇండియా సినిమా ‘దసరా’నా? అంటరా? అవును ఆ సినిమా గురించే చర్చ. నిజానికి ట్రైలర్ వచ్చిన వెంటనే ఈ చర్చ మొదలైంది. అయితే నాని ప్రయత్నాన్ని ఆదిలోనే విమర్శించడం ఎందుకని కొంతమంది ఆగితే, మరికొంతమంది మెల్లగా చూసి అభిప్రాయాలు చర్చించకుంటున్నారు.
వాటిలో భాగంగా వినిపించిన మాటే ‘కలిపి కొట్టు కావేటి రంగా’. తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రాంతంలో ఈ మాట బాగా వాడతారు. ఆ ప్రాంతం వాళ్లకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. తెలియనివాళ్ల కోసం ఈజీగా చెప్పాలంటే ‘ఆల్ మిక్సర్’. అదన్నమాట విషయం. సినిమా ట్రైలర్‌ను చూసిన చాలామంది జనాలు చెబుతున్న మాట ‘చాలా సినిమాలు కలిపేసి, స్ఫూర్తి పొందేసి తెరకెక్కించినట్లు ఉంది’ అని అంటున్నారు. మీకు కూడా ఇలానే అనిపించిందా అయితే మీరొక్కరే కాదు ఆ లిస్ట్‌లో. చాలామందే ఉన్నారు సోషల్ మీడియాలో.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మార్చి 30న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ ట్రైలర్ చూస్తుంటే హింస టన్నులు టన్నులు కనిపిస్తోంది. ప్రతీకారం, గ్రామీణ రాజకీయం నేపథ్యంలో రూపొందిన చిత్రం కాబట్టి అలాంటి హింస ఉంటుంది అనిపిస్తుంది. అయితే నాని లుక్, ట్రైలర్ థీమ్ చూస్తే ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘కేజీయఫ్’ లాంటివి కచ్చితంగా కనిపిస్తాయి.
పాన్ ఇండియా రేంజిలో వస్తున్న సినిమా కాబట్టి.. ఆ సినిమాల పోలికలు కామన్. అయితే మాటలు, చేతలు కూడా అలానే అనిపించడంతో నెటిజన్లు ఆల్ మిక్సర్ అనే మాట వాడుతున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల చేస్తున్నారు.