సినిమాలందు ‘రాధేశ్యామ్’ వేరయా? ఇదేంటి అంతమాట అనేశారు అనుకుంటున్నారా? ఆ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన వార్తలు, ఇప్పుడొస్తున్న వార్తలు, వినిపిస్తున్న పుకార్లు అలా అనేలా చేస్తున్నాయి. కారణం ఆ సినిమా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, సినిమా వాయిదాలు, ఫ్యాన్స్ బాధలు… ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన పుకార్లను మించేలా కొత్త పుకారు ఆకట్టుకుంటోంది. హిందీ, ఇతర భాషల సినిమాకు చాలా తేడా ఉంటుందట. ‘రాధేశ్యామ్’ సినిమా ఆలోచన చేసేటప్పుడు అది కేవలం తెలుగు సినిమా మాత్రమే.
‘బాహుబలి’, ‘సాహో’ల ఎఫెక్ట్‌తో ‘రాధేశ్యామ్’ కూడా పాన్ ఇండియా సినిమాగా మారింది. భారీ తారాగణం, అంతే స్థాయి బడ్జెట్‌తో సినిమా అత్యంత భారీ సినిమాగా మారిపోయింది. సినిమా స్థాయిని పెంచడానికి అదనపు మార్పులు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ జనాల కోసం అక్కడ వేరేగా పాటలు సిద్ధం చేయించారు. సౌత్ వెర్షన్ సినిమాల కోసం సంగీతానికి జస్టిన్ ప్రభాకరన్‌ను తీసుకుంటే, బాలీవుడ్ కోసం మిథూన్‌ను తీసుకున్నారు.
ఇప్పుడు సినిమా రన్‌టైమ్ విషయంలోనూ అలాంటి మార్పే కనిపిస్తోందట. సౌత్ ‘రాధేశ్యామ్’తో పోలిస్తే… నార్త్ ‘రాధేశ్యామ్’ నిడివిలో తేడా ఉంటుందట. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం చూసుకుంటే తెలుగు ‘రాధేశ్యామ్’ రెండు గంటల 20 నిమిషాలు ఉంటుంది. అయితే ఇప్పుడు హిందీ ‘రాధేశ్యామ్’ నిడివి రెండు గంటల 30 నిమిషాలపైనే అంటున్నారు. అంతేకాదు సినిమా ఎడిట్ విషయంలో మార్పులు ఉన్నాయట. అక్కడ నేటివిటీ, ఆలోచనలకు తగ్గట్టు సినిమాలో మార్పులు చేశారట.
అయితే ఈ విషయమై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న రిలీజ్ కానుంది. అన్నట్లు సినిమా రీరికార్డింగ్ కోసం ఇటీవల తమన్‌ను తీసుకున్నారు. అయితే తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సౌత్ వెర్షన్ కోసమే తీసుకున్నారని టాక్. మరి హిందీకి ఎందుకు తీసుకోలేదు అనేది వేరే విషయం. అయినా ఒక సినిమాను ఇలా రకరకాలుగా చేసి విడుదల చేయడం ఏంటో. అందుకే సినిమాలందు ‘రాధేశ్యామ్’ వేరయా!