ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. అందుకు కారణాలు ఏంటి అనేది కచ్చితంగా అర్థం కాక దర్శక నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఒకసారి టికెట్ రేట్లు ఎక్కువయ్యాయి అన్నారు. అవి తగ్గించారు. తర్వాత ఓటీటీలో సినిమా త్వరగా వచ్చేస్తుంది అన్నారు.దీంతో 5 వారాలు దాటే వరకు ఓటీటీ స్ట్రీమింగ్ ఇవ్వకూడదు అనే నిబంధన పెట్టారు. అయినా జనాలు థియేటర్ కు రావడం లేదు. దీని వల్ల బయ్యర్స్ భారీగా నష్టపోతున్నారు. ఈ కారణాల వల్ల నిర్మాతలు..
హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ బంద్ కు పిలుపునిచ్చారని, త్వరలో షూటింగ్లు నిలిచిపోతాయని వార్తలు వినిపించాయి. వీటి పై తాజాగా దిల్ రాజు స్పందించి క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ… ”నిర్మాతలంతా కలిసి మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్న మాట వాస్తవం. అయితే బంద్ గురించి ఇంకా మేము ఏమీ అనుకోలేదు. ఫలానా రోజు బంద్ అట… అంటూ ఏవేవో వార్తలు వచ్చేస్తున్నాయి. మేం బంద్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అసలు ఆ టాపిక్ కూడా రాలేదు. ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలన్న అంశం చర్చించాలి అనుకున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్మాతలంతా ఒక తాటిపైకే వస్తారు. ఎందుకంటే ఇది నిర్మాతల సమస్య కాదు. మొత్తంగా ఇండస్ట్రీ.. ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి.! నిర్మాత నష్టపోతే… తనొక్కడే పోడు. తన వల్ల.. హీరోలు, నటీనటులు, టెక్నీషియన్లు అందరి పై ఎఫెక్ట్ పడుతుంది. నిర్మాతల బాధల్ని హీరోలు, టెక్నీషియన్లు అర్థం చేసుకుంటారు అనే నమ్మకం మాకు ఉంది.
నిర్మాతల సమస్యలు అర్థం చేసుకోవడంలో మన టాలీవుడ్ హీరోలు బంగారం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్ అనే ప్రతిపాదన ఉన్నట్టు ఇండస్ట్రీలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కానీ దానివల్ల కూడా నిర్మాతలకే ఎక్కువ నష్టం. షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ కాకపోతే తెచ్చిన అప్పులకు వడ్డీల భారం ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.