పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ‘తొలిప్రేమ’ ఈ జూన్ 30 న రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ కెరీర్ ను మొదలుపెట్టిన ఇప్పటి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యి ‘తొలిప్రేమ’ నాటి సంగతుల్ని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” నాకు ‘తొలిప్రేమ’ అనేది ఓ గొప్ప జ్ఞాపకం. పవన్ కళ్యాణ్ గారు, కరుణాకరన్ గారు, జి.వి.జి.రాజు గారు అందరూ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు ఇచ్చారు.
నా (Dilraju) సినీ ప్రయాణంలో ‘తొలిప్రేమ’కి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఒకసారి రవీందర్ రెడ్డి అనే ఒక ఫైనాన్సియర్ నాతో మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారితో ఓ కొత్త కుర్రాడు సినిమా చేస్తున్నాడట. జి.వి.జి.రాజు గారు దానికి నిర్మాత’ అని చెప్పారు. నాకు తెలిసింది ఇదొక్కటే. అంతే నేను కొన్ని లెక్కలేసుకొని ఆ సినిమా ఓపెనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నాకు ఇండస్ట్రీలో ఏ పేరు లేదు.
ఒక్క ‘పెళ్లి పందిరి’ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశాను అంతే. వెంటనే జి.వి.జి.రాజు గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకుని డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగాను. పూజ పూర్తయ్యాక, ఒకసారి కలవమంటే.. మళ్ళీ వెళ్లి కలిశాను. అలా ఒక్క సిట్టింగ్ లోనే సినిమా కొనేశాను. ఆ తర్వాత ఈ సినిమాతో నాకు ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా, నా మనసులో ఎప్పటికీ తొలిప్రేమకి ప్రత్యేక స్థానం ఉంటుంది.
సినిమా ప్రివ్యూ నుంచి వంద రోజుల ఫంక్షన్ వరకు నాకు ఎన్నో జ్ఞాపకాలు. వంద రోజుల ఫంక్షన్ రోజు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అయినా ఆ ఫంక్షన్ కి కంట్రోల్ చేయలేనంత జనం వచ్చారు.ఇది ఒక చరిత్ర. అలాంటిది నేను మళ్ళీ చూడలేదు. ఇలా ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా ‘తొలిప్రేమ’. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు.నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకున్న ప్రతిసారి ‘తొలిప్రేమ’ ని రీరిలీజ్ చేసేవాడిని.
ఏదైనా ఫ్లాప్ వస్తే, ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాడిని. మొత్తం మూడుసార్లు నేను ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా తొలిప్రేమ. అలాంటి ‘తొలిప్రేమ’ లో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.