పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా అయినా మొన్నా మధ్య వరకు ‘ఓ సినిమా వస్తోంది’ అనేలా ఉండేది ప్రేక్షకుల్లో. ఫ్యాన్స్ అయితే కాస్త ఎగ్జైటింగ్ ఉండేవారంతే. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పటి నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా పరిస్థితి మారిపోయింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు వాటిని రెట్టింపు చేసేలా సినిమా నిర్మాత ఏఎం రత్నం, దర్శకుల్లో ఒకరైన జ్యోతి కృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో జులై 24న రాబోయే సినిమా గురించి ఆసక్తి మరింత పెరిగింది అని చెప్పాలి.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత ఏఎం రత్నం సినిమా బ్యాక్ స్టోరీ, షూటింగ్ ముచ్చట్లను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసినట్లు తెలిపారు. మాస్ కమర్షియల్ హీరో అయిన కల్యాణ్‌ను నిజమైన చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి ఉదయం ఒకట్రెండు గంటలు షూటింగ్ చేయవచ్చు. అయితే, మేం అనుకున్నట్లు సన్నివేశాలు తీయలేం. అందుకే చార్మినార్ సెట్ వేశాం అని చెప్పారు.
నిజమైన చార్మినాన్ ఎంత సైజ్‌లో ఉంటుందో అంత సెట్ క్రియేట్ చేసి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూట్ చేశాం అని ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. హార్బర్ సెట్ కూడా ఎంతో సహజంగా వచ్చిందని తెలిపారు. 17వ శతాబ్దంలో ఓడరేవులు ఎలా ఉండేవో అలాగే సెట్‌ను తీర్చిదిద్దామని నిర్మాత తెలిపారు. ఇక వీరమల్లుగా పవ న్‌కల్యాణ్ పాత్ర పరిచయ సన్నివేశాలు అభిమానులకు పండగలా ఉంటాయని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. వీరమల్లు పాత్రను ఎన్టీఆర్, ఎంజీఆర్ నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేసుకున్నామని జ్యోతికృష్ణ చెప్పారు.
పవన్ కల్యాణ్‌ను ప్రజలు హీరోగా కంటే కూడా నాయకుడిగా చూడటం మొదలు పెట్టారని.. అందుకు తగినట్లుగానే సినిమాలో కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దామని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు. సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా రన్‌టైమ్ 2:42 గంటలు.