మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయ సుస్మిత కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉందన్న విషయం తెలిసిందే. చాలా కాలమే ప్రకటించిన ఈ సినిమాకు 156 నెంబరు కూడా ఇచ్చేశారు. అయితే అనూహ్యంగా ఆ సినిమా స్థానంలో 157వ సినిమా వచ్చేసింది. దీంతో ఇక సుస్మిత నిర్మాతగా చిరు సినిమా ఉండకపోవచ్చు అంటూ ఓ పుకారు మొదలైంది… అయితే తొలుత అనుకున్న సినిమా కంటే భారీ చిత్రం ఇప్పుడు సుస్మిత నిర్మాణంలో ఉంటుంది అంటున్నారు. ఈ మేరకు దర్శకుడు కూడా ఫైనల్ అయ్యారట.
‘గాడ్ ఫాదర్’ సినిమాతో కాస్త ఆలోచనలో పడిన చిరంజీవి… ‘భోళా శంకర్’ ఘోర ఫలితం తర్వాత పూర్తిగా ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచన రీమేక్‌ల గురించే అని మీకు అర్థమైపోయుంటుంది. వరుసగా రీమేక్‌లు చేస్తున్న మెగా ఫ్యామిలీ సీనియర్ స్టార్ హీరోలు ఇప్పుడు ఆ దిశగా వెళ్లకూడదని అనుకున్నారని టాక్. ఈ క్రమంలోనే మలయాళ హిట్ మూవీ ‘బ్రో డాడీ’ రీమేక్ కూడా ఆగిపోయిందని చెబుతున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల ఆ సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఇప్పుడు ఆ కథను, ఆ సినిమాను పక్కన పెట్టేశారట చిరంజీవి. ఇప్పటికిప్పుడు రీమేక్‌ల వైపు మళ్లీ వెళ్లకూడదు అనేది ఆయన ఆలోచన. అందుకే తన కూతురు కోసం మరో దర్శకుణ్ని తీసుకొచ్చారు. ఈసారి కథను కాదు కానీ.. దర్శకుడినే వేరే భాష నుండి తెచ్చారు. ‘అభిమన్యుడు’, ‘సర్దార్’ లాంటి హిట్ సినిమాలు తీసిన పి.ఎస్.మిత్రన్‌తో చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని టాలీవుడ్ లేటెస్ట్ టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే మెగా157 సినిమా అవుతుంది.
‘సర్దార్’ సినిమా రిలీజయ్యాక చిరుని కలసి మిత్రన్ ఓ స్టోరీ లైన్ చెప్పారట. పాయింట్ విషయంలో ఇంప్రెస్ అయిన చిరు పూర్తి వెర్షన్ సిద్ధం చేయమన్నారట. ఇప్పుడు ఆ వెర్షన్ సిద్ధమైందని, కథ మెగాస్టార్ మనసు చూరగొందని చెబుతున్నారు. మిత్రన్ చెప్పింది సీరియస్ సబ్జెక్టు అని టాక్. మామూలుగానే ఆయన సోషల్ ఇష్యూ లేనిదే స్టోరీలు రాయరు. ఇప్పుడు కూడా అదే పని చేశారట.