అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా మారిన హను రాఘవపూడి మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అటు తర్వాత నాని తో కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా చేశాడు. అది బాగానే ఆడింది. దీంతో టాప్ హీరోలు అంతా హను రాఘవపూడితో సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ క్రమంలో నితిన్ తో చేసిన లై, శర్వానంద్ తో చేసిన పడి పడి లేచె మనసు చిత్రాలు పెద్ద డిజాస్టర్ లు అయ్యాయి.
ఈ రెండు సినిమాలు ఫస్ట్ హాఫ్ పరంగా చాలా బాగుంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాజిక్ లెస్ గా సాగుతాయి,సినిమా ముగించిన విధానం కూడా ఇన్ కంప్లీట్ గా అనిపిస్తుంది. అంతకు ముందు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా అలానే ఉంటాయి. అయితే సీతా రామం సినిమా విషయంలో ఇతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగుతో పాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా సూపర్ సక్సెస్ సాధించింది.
‘సీతా రామం’ తర్వాత హను రాఘవపూడి నాని తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. రాంచరణ్ ను కూడా అప్రోచ్ అయ్యాడు. అతను కూడా ప్రస్తుతం ఖాళీగా లేడు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్యని అప్రోచ్ అయ్యి కథ చెప్పాడు. హను చెప్పిన కథకి ఇంప్రెస్ అయిపోయాడు సూర్య. వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది.
‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగు దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో కార్తీ కూడా ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.