ఒక్కో సినిమా మీద ఏళ్ల తరబడి కూర్చోవడం మనకు పెద్ద కొత్త విషయమేమీ కాదు. రాజమౌళి లాంటి వాళ్లు రెండు, మూడేళ్లు కష్టపడి ఓ సినిమా చేస్తారు. మరికొందరు సినిమా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో, పోస్ట్‌ప్రొడక్షన్‌కి అన్నే రోజులు తీసుకుంటూ ఉంటారు. ఇవంతా ఒకే రకం. సినిమా సెట్స్ మీదో, లేదంటో పనుల్లో ఉంటుంది. అయితే సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు జరగకపోయినా ఏళ్ల తరబడి అదే సినిమాతో ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది.
ప్రస్తుతం అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది (Director Krish) క్రిష్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఆయన్ను డైలామాలో పడేసింది అంటున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ సుమారు రెండున్నరేళ్లుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తెరకెక్కిస్తున్నారు. వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. మొదలైనట్లే మొదలై మధ్యలో ఆగిపోతోంది. ఈ లోపు పవన్ కల్యాణ్ వేరే సినిమాలు వరుస షెడ్యూల్స్ చేసేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో తొలి రోజుల్లో ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ అంచనాలను వేరే సినిమాలవైపు మళ్లించారు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా అదే పని చేస్తున్నారు అని టాక్. ‘హరి హర వీరమల్లు’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం పక్కనపెడితే.. ఎప్పుడు షూటింగ్ ఉంటుంది అనే విషయమే తెలియడం లేదు. ఈ కారణంతోనే క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకుంటారు అని టాక్ నడుస్తోంది. క్రిష్ స్పీడ్ తెలిసినవాళ్లు ఈ రెండున్నరేళ్లలో రెండు, మూడు సినిమాలు చేసేసేవారు ఆయన అంటున్నారు. ఇన్నాళ్లు ఆగిన ఆయన ఇక ఆగను అనుకుంటున్నారని..
వేరే సినిమా స్టార్ట్ చేసుకోవడం కానీ, పూర్తిగా ఈ సినిమా వదిలేయడం కానీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. అయితే ఇంత కష్టపడి ఇన్నాళ్లూ సినిమా చేసి వదిలేసుకోవడం కరెక్ట్ కాదనే చర్చ కూడా నడుస్తోంది. గతంలో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ నుండి ఇలానే మధ్యలో బయటకు వచ్చేశారు ఆయన. ఇప్పుడు అదే పని చేయరు అని అంటున్నారు. అందుకే ఈ సినిమాకు పవన్ టైమ్ ఇచ్చినప్పుడు చేసి.. మిగిలిన సమయంలో తానొక సినిమా చేసుకుందాం అంటున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని టాక్. ఇదిలా ఉండగా జులై రెండో వారంలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఉంటుందని ప్రాథమిక సమాచారం.