రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలు ఎంత భారీగా ఉన్నా.. అందులో ఓ సున్నితమైన ప్రేమకథ ఉంటుంది. కావాలంటే ఆయన సినిమాల లిస్ట్ ఒకసారి మీరే చూడండి. ప్రతి కథ భారీగా ఉంటుంది, ప్రతి సినిమా భారీగా ఉంటుంది. అలాగే మనసును మెలితిప్పే లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కొన్ని ప్రేమకథల్లో అనుకోని ఎండింగ్ కూడా ఉంటుంది. దీనికి కారణం ఆయన ప్రేమకథేనా? ఏమో ఆయన లేటెస్ట్‌గా చెప్పిన టీనేజ్ లవ్ స్టోరీ వింటే అలానే అనిపిస్తోంది.
Rajamouli
రాజమౌళి గతం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన కూడా తన పాత రోజుల గురించి గుర్తుచేసుకున్న సందర్భాలు తక్కువ. రానా దగ్గుబాటి (Rana Daggubati) టాక్ షోలో తొలిసారి తన టీనేజ్ ప్రేమకథను బయటపెట్టారు రాజమౌళి. తన ఇంటర్మీడియట్ రోజుల్లో జరిగిన ఆ ప్రేమ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన క్లాస్‌లో భారతి అనే ఓ అమ్మాయి ఉండేదని.. ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు రాజమౌళి.
ఆమెతో మాట్లాడటానికి భయమేసేదని, అయితే ఆ అమ్మాయంటే ఇష్టమని క్లాసులో అబ్బాయిలకు కూడా తెలుసని చెప్పారు జక్కన్న. వాళ్లు ఆయన్ను ఎన్నోసార్లు ఏడిపించారట. ఆ ఇయర్ మొత్తంలో ఒకే ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడాను అని రాజమౌళి చెప్పారు. అది కూడా ‘భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా’ అని అడిగారట. ఆ పిలుపుతో ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కి తిరిగి తనవైపు చూసిందని తెలిపారు రాజమౌళి.
‘భారతీ..’ అని పిలవగానే ‘నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా’ అన్నట్లు ఆమె చూసింది. అప్పుడు ‘ట్యూషన్ ఫీజు కట్టావా’ అని అడిగే సరికి.. ఆమె ముఖంలో తెలియని నిరాశ కనిపించింది. ‘పిలిచింది ఇది అడగటానికా’ అన్నట్లు చూసి తల ఊపి వెళ్లిపోయింది. ఇక్కడో విషయం ఏంటంటే.. ‘ఈగ’ (Eega) సినిమాలో నాని (Nani), సమంత (Samantha) మధ్య ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి. అంటే నిజ జీవితం నుండి రాజమౌళి ఆ సీన్స్ సినిమాకు తెచ్చారని అర్థమవుతోంది.