సినిమాల్లో టెక్నాలజీ అంటే మనకు బాగా తెలిసిన విషయాలు విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్. ఇంకొన్ని ఉన్నాయి కానీ అవి సగటు సినీ గోయర్స్‌కు పెద్దగా తెలియవు. గత కొన్నేళ్లుగా ఇవే చూస్తున్నాం కూడా. అయితే రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే సాంకేతికత వినిపిస్తోంది. మ్యూజిక్ విషయంలో దీనిని వాడుతున్నారు. అలా విజయ్ (Vijay Thalapathy) కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(The Greatest of All Time )లో వాడారు. తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) ఈ విషయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Venkat Prabhu
సినిమాలో గాయని భవతారణితో ఓ పాట పాడించాలని అనుకున్నామని, దాని కోసం ట్యూన్ కంపోజ్ కూడా చేశామని చెప్పారాయన. అయితే ట్యూన్ పూర్తయిన రోజే ఆమె మృతి చెందారని తెలిపారు. ఆ వార్త తెలిసి జీర్ణించుకోలేకపోయామని, అందుకే ఆమె గొంతుతోనే ఆ పాట ఉండేలా చూశామని చెప్పారు. సినిమాఓ ‘చిన్న చిన్న కంగళ్..’ అనే పాట థీమ్ గురించి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు (Yuvan Shankar Raja) వెంకట్ ప్రభు (Venkat Prabhu) చెప్పారట. ఆ పాట ఆయన సోదరి, గాయని భవతారణి పాడితే బాగుంటుంది అని కూడా చెప్పారట.
అయితే ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో ఉన్నారు. కోలుకుని చెన్నై వచ్చాక పాడిద్దామని ప్లాన్ చేశాక. దురదృష్టవశాత్తూ ఆమె మరణించడంతో ఏఐ సాయంతో పాడించారు. రజనీకాంత్ (Rajinikanth) ‘లాల్ సలామ్’ (Lal Salaam) సినిమాలో ఓ పాటలో దివంగత గాయకుడు షాహుల్ హమీద్ గాత్రాన్ని తీసుకున్న అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘గోట్’లో చేద్దామంని వెంకట్ ప్రభు (Venkat Prabhu) అనుకున్నారట. దాంతో ఆ విషయంలో రెహమాన్ (A.R.Rahman) టీమ్ సాయంతో వివరాలు తెలుసుకున్నారట. అలా భవతారణి రా వాయిస్ తీసుకుని, మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా అవుట్‌పుట్ తీసుకొచ్చారట.
ట్యూన్ నచ్చడంతో స్వయంగా విజయ్ ఆ పాటను పాడతానన్నారట. అలా విజయ్, భవతారణిల గానంతో పాటను పూర్తి చేశాం అని వెంకట్ ప్రభు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) కుమార్తెనే భవతారణి. క్యాన్సర్ చికిత్స తీసుకోవడానికి ఈ ఏడాది జనవరిలో శ్రీలంక వెళ్లి ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘ది గోట్’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.