తెలుగు సినిమా దర్శకుల రూటు మారుతోందా? అగ్ర దర్శకుల చూపు యానిమేషన్ వైపు వెళ్తోందా? ఇటీవల కాలంలో ఇద్దరు అగ్రదర్శకుల రాబోయే సినిమాల లిస్ట్‌లో యానిమేషన్ సినిమా పేరు వినిపిస్తోంది. మొన్నటికి మొన్న రాజమౌళి ఇలాంటి యానిమేషన్ సినిమా తీస్తున్నారని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. తాజాగా మరో దర్శకుడు కూడా అలాంటి ఆలోచనే చేస్తున్నారు. అయనే విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె. కుమార్. ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట అయిన విక్రమ్ కె.కుమార్ ఫ్యూచర్ లైన్‌లో లైవ్ యానిమేషన్ సినిమా ఒకటి ఉందట.
యానిమేషన్ సినిమా ఒకటి చేయాలని విక్రమ్ కుమార్ ఎప్పటి నుండో అనుకుంటున్నారట. అందులోనూ అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందిట. దీని కోసం కచ్చితంగా నాలుగేళ్లు కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టులో 50 శాతం పూర్తి చేశారట. మిగిలిన పని పూర్తి చేసి ఓ సంవత్సరం తర్వాత ఈ ఈ సినిమా పనులు ప్రారంభించాలని విక్రమ్ కుమార్ ఆలోచిస్తున్నారట. అంతే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ ఉంటారట. ఈ సినిమా గురించి ఇద్దరూ ఇప్పటికే చర్చించుకున్నారట.
సినిమా విజయాన్ని, పరాజయాన్ని విక్రమ్ కుమార్ పట్టించుకునే విధానం కొత్తగా ఉంటుంది. కథని అనుకున్నట్టుగా తీయడం కోసం దర్శకుడిగా కష్టపడి పనిచేయాలి అంటారు ఆయన. ఆ సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు అని చెబుతుంటారు. సినిమా విజయం సాధిస్తే శుక్రవారం, శనివారం, ఆదివారం సంతోషించాలి. ఫ్లాప్ అయితే మూడు రోజులు బాధపడాలి. వెంటనే తేరుకొని సోమవారం నుండి కొత్త సినిమా పనులు మొదలుపెట్టాలి. ఈ విషయాన్ని ఎవరో ఒక పెద్దాయన విక్రమ్ కుమార్‌కు చెప్పారట. ఈ సూత్రాన్నే ఆయన అనుసరిస్తున్నారట. బాగుంది కదా ఈ సూత్రం.