మొన్న ‘ప్రముఖ నటులు కోటా శ్రీనివాస్ హఠాణ్మరణం’, నిన్న ‘కార్ యాక్సిడెంట్ లో మరణించిన శ్రీకాంత్’, నేడు ‘సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్నుమూత’. యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం మాత్రమే కాదు ఆల్మోస్ట్ అన్నీ వెబ్ సైట్స్ లోనూ పబ్లిష్ అయిన వార్తలివి. ఇవి నిజం కావని అందరికీ ఇప్పటికే తెలిసిపోయినప్పటికీ.. సదరు వార్త పబ్లిష్ అయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత క్షోభకు గురి అయ్యుంటారు అనేది తలచుకొంటే బాధ మాత్రమే కాదు సదరు సోది న్యూస్ రాసిన వారిపై కోపం కూడా వస్తుంది. ఈ విషయమై ఇటీవల శ్రీకాంత్ స్పందిస్తూ.. “వ్యూస్ కోసం లైక్స్ కోసం తప్పుడు వార్తలు రాయకండి” అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అంతకుమునుపు కోటా శ్రీనివాసరావు గారైతే ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి.. “దయచేసి నన్ను బ్రతకనివ్వండి” అని వేడుకొనే స్థాయికి దిగజారిపోయారు కొందరు.
ఇక నిన్న ఉదయం “వంకాయల సత్యనారాయణ” అనే సీనియర్ సైడ్ ఆర్టిస్ట్ చనిపోతే.. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి ఏకంగా సీనియర్ నటుడు “కైకాల సత్యనారాయణ మరణం” అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ క్రియేట్ చేశారు. దాంతో కైకాల బంధువులందరూ కంగారుపడి ఆయని ఫోన్లు చేయడం మొదలెట్టారట. దాంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి “కైకాల సత్యనారాయణ బ్రతికే ఉన్నారు” అని స్టేట్ మెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న నమ్మకం లేదు, కాకపోతే ఇకనైనా కనీసం ఒకసారి ఆలోచిస్తారన్న చిన్న ఆశ.