ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జనాలకు మంచి చేస్తుంది అని అనుకుంటే.. అది ముంచేదిలా మారింది అని అర్థమవుతోంది. లేనిది ఉన్నట్లు చేసి చూపించి కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఈ క్రమంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రష్మిక మందన (Rashmika Mandanna), ఆలియా భట్ (Alia Bhatt), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), దీపిక పడుకొణె (Deepika Padukone), కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇలా ఇబ్బంది పడ్డవాళ్లే. ఇప్పుడు ఈ జాబితాలోకి సమంత వచ్చి చేరింది.
సమంత (Samantha) వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యతో ఆమె డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది. అందులో గణేశ్ మాస్టర్ సమంతను కాస్త గట్టిగానే పట్టుకున్నారని, తడిమేస్తూ, ముద్దు పెట్టుకున్నాడు అంటూ ఆ వీడియోలో చూపించారు. ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) సినిమా షూటింగ్ సమయంలో ఇది జరిగి ఉండొచ్చు అంటూ కొంతమంది అంచనాలు కూడా వేసేశారు.
దీంతో నిజమేంటా అని చూస్తే.. ఆ వీడియో గణేశ్ ఆచార్య, హీరోయిన్ డైసీ షాతో షూట్ చేసింది. ఓ సినిమాలోని పాట కోసం రిహార్సల్స్ చేస్తున్న క్లిప్ అది. ఆ వీడియోల డైసీ షా స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సమంతను పెట్టారు. చూడటానికి ఒరిజినల్‌లా ఉండటంతో అందరూ ఆమెనే అనుకుంటూ ఇదేంటి సమంత ఇలా చేసింది, మాస్టర్ ఏంటి ఇలా ఉన్నారు అని కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు.
దీంతో సమంత కూడా ఏఐ బారిన పడి ఇబ్బంది పడింది అని తేలిపోయింది. టెక్నాలజీ తీసుకొచ్చిన తిప్పల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. ఏం జరిగింది, నిజమేనా? అసలు సాధ్యమేనా అనే బేసిక్ డౌట్స్ మనిషి వదిలేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి వీడియోలు ఇంకా ఇబ్బందిని తీసుకొస్తాయి. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతున్నా, సిద్ధమవుతున్నా ఇంకా ఆగడం లేదు. చూడాలి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన చట్టాలు ఎప్పటికి తీసుకొస్తుందో?