సాధారణంగా మల్టీ స్టారర్స్ పై ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొని ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసినటిస్తే వాళ్ళ ఫ్యాన్స్ విడుదల ముందు నుండే లెక్కలు, కొలత వేసేసుకుంటారు. సినిమాలో ఆరు పాటలంటే మా హీరోకి కనీసం మూడు పాటలకి పైనే ఉండాలని, నాలుగు ఫైట్స్ ఉంటే మా హీరోకి కనీసం రెండు ఫైట్స్ ఉండాలని కోరుకోవడం.
డైరెక్టర్ కి సూచనలు పంపడం చేస్తుంటారు. ఓ మల్టీ స్టారర్ వస్తే అవతలి హీరోకి మా హీరో ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించుకోవాలన్నదే వారి తాపత్రయం. అందుకే టాలీవుడ్ లో ఒకే స్థాయి ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు మల్టీ స్టారర్ కి ఒప్పుకోరు. దర్శకులకు సైతం ఇద్దరి హీరోలు, వారి ఫ్యాన్స్ రిక్వైర్మెంట్స్ పూర్తి చేస్తూ సినిమా తీయాలంటే జరిగే పనికాదు. అందుకే స్టార్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేసే సాహసం చేయరు.
కాగా ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగేలా ఉంది. నిన్న ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ వచ్చినప్పటి నుండి చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య వార్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. రౌద్రం రణం రుధిరం సినిమాలో రాజమౌళి మా హీరోకి ప్రాధాన్యం ఇచ్చి ఉంటాడు అంటే కాదు మా హీరోకి ప్రాధాన్యం ఉంటుందని సోషల్ మీడియా వార్ షురూ అయినట్లు తెలుస్తుంది. కేవలం ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ లో హీరోలను పరిచయం చేసిన దానికే ఈ రేంజ్ లో ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంటే మరి రేపు సినిమా విడుదలయ్యాక వీరి మధ్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో ఉహించుకోవడమే కష్టంగా ఉంది.