ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పూర్ణోదయ కొన్నాళ్ళ విరామం అనంతరం తమ నిర్మాణ సారధ్యంలో రూపొందించిన చిత్రం “ఫస్ట్ డే ఫస్ట్ షో”. “జాతిరత్నాలు” ఫేమ్ అనుదీప్ కథ-కథనం అందించిన ఈ చిత్రం ట్రైలర్ & టీజర్ ఓ మేరకు ఆకట్టుకున్నాయి. మరి సినిమా పరిస్థితి ఏంటో చూద్దాం..!!
కథ: కొద్దిరోజుల్లో పవన్ కళ్యాణ్ ఖుషి విడుదలకు రెడీగా ఉంది. ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సంపాదించి, తన గర్ల్ ఫ్రెండ్ లయ (సంచిత బసు)ను ఇంప్రెస్ చేయడమే ధ్యేయంగా భావిస్తాడు శ్రీనివాస్ (శ్రీకాంత్ రెడ్డి). ఆ టికెట్ సాధించడం కోసం అతడు పడిన పాట్లే “ఫస్ట్ డే ఫస్ట్ షో” కథాంశం.
నటీనటుల పనితీరు: సంచిత బసు కళ్ళతో ఆకట్టుకుంది. డైలాగ్ డెలివరీ & లిప్ సింక్ తో చాలా ఇబ్బందులుపడినప్పటికీ.. లుక్స్ తో అలరించింది. శ్రీకాంత్ రెడ్డి హీరోకి తక్కువ, ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఎక్కువ అన్నట్లు ఉన్నాడు. ఇక వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి వంటి వారి నటన బాగున్నప్పటికీ.. వారి పాత్రలో సోసోగా ఉండడంతో, పెద్దగా కనెక్టివిటీ ఉండదు.
సాంకేతికవర్గం పనితీరు: సెన్స్ లెస్ కామెడీ అనేది చాలా మంచి జోనర్. కథ-కథనం, క్యారెక్టర్ ఆర్క్, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి ఏవీ పెద్దగా అవసరం లేని ఏకైక జోనర్ ఇది. అయితే.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే మాత్రం హిలేరియస్ కామెడీ పండాలి. ఈ చిత్రంలో సదరు కామెడీని పండించడంలో దర్శక ద్వయం, రచయిత.. ముగ్గురూ ఫెయిల్ అయ్యారు.
కనీసం కామెడీ ట్రాక్ లా కూడా పనికిరాని ఒక పాయింట్ ను ఏకంగా మెయిన్ ప్లాట్ గా ఎంపిక చేసుకొని, దాన్ని రెండు గంటల సినిమాగా నడిపించడం అనేది సిల్లీయస్ట్ పాయింట్. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రధన్ మాత్రం ఎప్పట్లానే కొత్త తరహా పాటలు, నేపధ్య సంగీతంతో అలరించాడు.
విశ్లేషణ: ఒక సీనియర్ ప్రొడక్షన్ హౌజ్ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చి.. షూటింగ్ మొదలుకొని, ప్రమోషన్స్ వరకూ ప్రతి అంశంలోనూ చక్కని సపోర్ట్ ఇచ్చినప్పుడు.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చక్కని ప్రోడక్ట్ ఇవ్వాలి కానీ.. ఇలాంటి లేకి సినిమాలు తీయడం అనేది క్షమించరాని నేరం. అవకాశాలు దొరక్క లక్షల మంది అవస్తలు పడుతుంటే.. వచ్చిన అవకాశాన్ని దారుణంగా దుర్వినియోగపరుచుకొని.. నిర్మాతల నమ్మకాన్ని వమ్ము చేశారు ఈ యువ బృందం.