కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.ఆ వార్త దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. జిమ్ చేస్తుండగా ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు, అసిస్టెంట్లు హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పునీత్ ను కాపాడుకోలేకపోయారు. 46 ఏళ్ళకే పునీత్ మరణించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. పునీత్ కు గుండెపోటు రావడం అది మొదటి సారి కాదట.
అంతకు ముందే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులందరికీ గుండె జబ్బులు ఉన్నాయనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు డాక్టర్ సి ఎస్ మంజునాథ్. ఈయన బెంగళూరు జయదేవ హృద్రోగ, పరిశోధన సంస్థ డాక్టర్. పునీత్ రాజ్ కుమార్ అలాగే అతని సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ లకు గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని.. అది వారికి వంశపారంపర్యంగా వస్తుందని చెప్పుకొచ్చారు.
అందువల్లనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు కఠినమైన బరువులు ఎత్తి వర్కౌట్లు చేయకూడదని.. కేవలం వాకింగ్ మాత్రమే చేయాలని మంజునాథ్ తెలిపారు. పునీత్ కు కఠినమైన వర్కౌట్లు చేయడం అలవాటని.. అతనికి అంతకు ముందు గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని లెక్కచేయకుండా అతను సినిమాల కోసం కఠినమైన వర్కౌట్లు చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడని.. మంజునాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు.