మా ఎన్నికలు రాష్ట్రస్థాయి ఎన్నికలను తలపిస్తున్నాయి. రాజకీయాల్లో కార్యకర్తలు ఎలాగైతే గొడవలకు దిగుతారో అదే తరహాలో మా సభ్యులు కొట్లాటకు పాల్పడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మా ఎన్నికల్లో వాతావరణం వేడెక్కింది. ఉదయం 8గంటలకు ప్రశాంతంగా మొదలైన పోలింగ్ 10గంటల తరువాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పోలింగ్ చేసే క్రమంలో ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు విష్ణు ప్యానెల్ పై ఆరోపణలు చేశారు.
ఇక రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో అభ్యర్థుల మధ్యలో ఒక్కసారిగా గొడవలు పెరిగాయి. శివబాలాజీ చేయిని హేమా కొరికారు అని నరేష్ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక నాకు, ప్రకాష్ రాజ్‌కు గొడవ జరగలేదు.. బయటివాళ్లు రాకూడదని చెప్పాం అని నరేష్ పలు ఆరోపణలు కూడా చేశారు. ఇక ఈ ఎన్నికల్లో దాదాపు 900 మంది పాల్గొనాల్సి ఉండగా చాలా తక్కువమంది ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక రిగ్గింగ్ జరిగింది అని చెప్పగానే మోహన్ బాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు బెనర్జీ అడ్డుకునే ప్రయత్నం చేయగా చంపేస్తాను అంటూ హెచ్చరించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను అంటూ అందులో ఎలాంటి అనుమానం లేదని మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.