కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు… ‘గుంటూరు కారం’ సినిమా వాయిదాకు కూడా కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఇది కాస్త అతిశయోక్తిగా వినిపించొచ్చు కానీ.. సినిమా పరిస్థితి మాత్రం అలానే ఉంది. నానా వాయిదాల తర్వాత మొదలవుతున్న సినిమా షూటింగ్ ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతూ వస్తోంది. దీంతో అసలు ఈ సినిమా ఉందా? లేదా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే సినిమా ఆలస్యానికి ఉన్న కారణాల్లో లేటెస్ట్ కారణం ఒకటి తెలిసింది.
కడుపుమంట తగ్గడానికి మజ్జిగ తాగండి అంటూ ఆ మధ్య సంగీత దర్శకుడు తమన్ ఓ ట్వీట్ చేసి ఫ్యాన్స్‌ను, నెటిజన్లను కామెంట్ చేశారు గుర్తుందా? ఇప్పుడు లేటెస్ట్ వాయిదా ఆయనే కారణం అని అంటున్నారు. ఈ సినిమా సంగీతం విషయంలో చాలా తర్జనభర్జనలు పడి ఆఖరికి ఆయనను బయటకు పంపించేశారు అని అంటున్నారు. దీనిపై క్లారిటీ అయితే లేదు కానీ.. సినిమా వేరే సంగీత దర్శకుడు పని చేస్తున్నారనే విషయం మాత్రం పక్కా అంటున్నారు.
ఈ మేరకు సినిమా కోసం లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అబ్దుల్ వాహిబ్‌ను తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. మరికొందరేమే యువ సంగీత దర్శకుడు భీమ్స్ చేత శాంపిల్ సాంగ్ ఒకటి రికార్డు చేయించారు అని అంటున్నారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆ బిట్ సాంగ్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తమన్ ఇన్ ఆర్ ఔట్ అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే సినిమా ఆలస్యానికి ఆయనే కారణం అంటూ వస్తున్న పుకార్ల సంగతి కూడా తేలుతుంది.
మరికొందరు అయితే తమన్ ఈ సినిమాలో ఉన్నారని.. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని కూడా అంటున్నారు. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని తెలుస్తోంది. సినిమా వచ్చేలోపు ప్రతి నెలా ఓ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నారట. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. కానీ ప్రజెంట్ షూటింగ్ మూడ్ చూస్తుంటే వచ్చేలా లేదు.