గత నెలరోజులుగా ఇండియాలోని మెట్రో సిటీలన్నీ చుట్టేస్తూ.. “సరిపోదా శనివారం” ప్రమోషన్స్ లో యమ బిజీగా ఉన్నాడు నాని. ఆయన మునుపటి సినిమాలు “దసరా హాయ్ నాన్న”లను కూడా ఆయన ఇదే తీరులో ఇండియా మొత్తం ప్రమోట్ చేసినప్పటికీ.. “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) విషయంలో మాత్రం కాస్త డోస్ పెంచాడు. సరిగ్గా రెండ్రోజుల్లో (ఆగస్ట్ 29) సినిమా విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించాడు నాని. సినిమా విశేషాలు, తదుపరి సినిమా వివరాలు, అంటే సుందరానికి సినిమా రిజల్ట్ నుండి నేర్చుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..!!
సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎంత ప్రమోషన్ చేసినా సరిపోదు..
నా అన్ని సినిమాల కంటే “సరిపోదా శనివారం” చిత్రాన్ని కాస్త ఎక్కువగానే ప్రమోట్ చేస్తున్నాను. ఎంత ప్రమోట్ చేసినా సరిపోవట్లేదనిపిస్తోంది. ఎందుకంటే.. ఆన్లైన్ ప్రమోషన్స్ తో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించవచ్చు. కానీ.. ఇంట్లో కూర్చున్నవారిని కూడా థియేటర్లకు రప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఇంపాజిల్ టాస్క్ ను సక్సెస్ చేయడం కోసమే ఇన్ని ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది.
అలా అనుకుంటే ఇండస్ట్రీలో ఎవరికీ సినిమాలుండవు..
చాలామంది ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో అవకాశం ఇచ్చారెందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలా ఫ్లాప్ ఇచ్చినవాళ్లకి అవకాశాలు ఇవ్వకూడదు అంటే.. ఇండస్ట్రీలో ఎవరికీ సినిమాలుండవు, ఒక్క రాజమౌళికి తప్ప. అయితే.. వరుస విజయాలతో దూసుకుపోతున్నవాడికంటే.. ఒక్క పరాజయంతో ఒక్క అడుగు వెనక్కి వేసినవాడు ఇంకాస్త జాగ్రత్తతో సినిమా తీస్తాడు అని నమ్ముతాను.
ఆ టైంలో వివేక్ చాలా డిప్రెస్ అయ్యాడు..
“అంటే సుందరానికి” విడుదలైన రెండు నెలలవరకు వివేక్ ఆత్రేయ చాలా ఇబ్బందిపడేవాడు. తానేమైనా తప్పు చేశానేమో అనే భావనతో బాధపడేవాడు. అలాంటి తరుణంలో వివేక్ కి ఒక మోరల్ సపోర్ట్ గా ఉన్నాను నేను. ఆ మోరల్ సపోర్ట్ తర్వాత వచ్చిన కథే “సరిపోదా శనివారం”. ఈ సినిమాతో వివేక్ రీసౌండ్ వచ్చే హిట్ కొట్టడం ఖాయం.
జేక్స్ బిజోయ్ గురించి సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడుకుంటారు..
మాములుగా సినిమాలో టైటిల్ సాంగ్ లేదా ఒక ఎంట్రీ సీన్ కి ఫుల్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కొడతారు. కానీ.. జేక్స్ బిజోయ్ మాత్రం “సరిపోదా శనివారం” సినిమా మొత్తానికి ఏదో టైటిల్ సాంగ్ కి మ్యూజిక్ కొట్టినట్లుగా కొట్టాడు. సినిమా మొత్తం ఒక భీభత్సమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని జేక్స్ బిజోయ్ చాలా బాగా కంపోజ్ చేశాడు. సినిమా రిలీజ్ తర్వాత అతని పనితనం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు.
ఎస్.జె.సూర్య వల్ల నేను హ్యాపీగా బ్యాక్ సీట్లో ఎంజాయ్ చేస్తున్నాను..
మాములుగా నా ప్రతి సినిమాకి నేనే ప్రతి బాధ్యత తీసుకొంటాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లా మారిపోయి ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటాను. కానీ.. “సరిపోదా శనివారం” విషయానికి వచ్చేసరికి, ఎస్.జె.సూర్య, జేక్స్ బిజోయ్, వివేక్ ఆత్రేయ అన్నీ చూసుకున్నారు. అందువల్ల నేను చాలా కాలం తర్వాత బ్యాక్ సీట్ తీసుకొని హ్యాపీగా “నేను ఈ సినిమా హీరో” అనే స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నాను.
నాకు సినిమా హిట్టయ్యిందని తెలిస్తే సరిపోదు..
మాములుగా ఫ్రైడే రోజు రెండు షోలు పడిన తర్వాత ఎవరైనా వచ్చి సినిమా హిట్ అంట, బ్లాక్ బస్టర్ అంట అని చెప్పిన వెంటనే నేను ఆనందపడిపోను. సినిమాతో అనుసంధానమైన వాళ్లందరూ ఆనందంగా ఉన్నారా అని చెక్ చేసుకుంటాను. వాళ్ళందరూ హ్యాపీ అని చెప్పిన తర్వాతనే నేను సంతోషపడతాను.
నా సినిమాతో డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే, నేను బాధ్యత తీసుకుంటాను..
నేను నటించిన సినిమా ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేసిన ఒక డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే.. నేను వెంటనే బాధ్యత తీసుకొంటాను. ఒక్కోసారి వారి నష్టాలు కవర్ చేసిన సందర్భాలున్నాయి, లేదంటే నా తదుపరి సినిమాకి పెద్ద ఆఫర్ వచ్చినా, ఇదివరకు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ కు తక్కువ రేట్ లో అతని నష్టాలు కవర్ అయ్యేలా సెటిల్ చేసి ఇప్పించిన సందర్భం కూడా ఉంది.
ప్రశ్నించడం అవసరం అనిపించింది..
నేను “శ్యామ్ సింగరాయ్” ప్రమోషన్స్ లో టికెట్ రేట్ల విషయంలో కొందరు వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడిన మాటలను చాలామంది రాజకీయంగా వక్రీకరించారు. దానివల్ల కొంత ఇబ్బందిపడాల్సి వచ్చింది కానీ.. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును ప్రశ్నించకుండా ఉండలేకపోయాను. అంతే తప్ప ఒకర్ని ఎద్దేవా చేయాలనే ఉద్దేశ్యం నాకు ఎప్పడు లేదు.
మా జున్ను గాడు నా సినిమాలు పెద్దగా చూడడు..
మా జున్నుకి ఇంకా సినిమాలు అలవాటు అవ్వలేదు. ఏదో నేను డబ్బింగ్ చెప్పానని “సింబా”, చిన్న పాప ఉందని “హాయ్ నాన్న” చూశాడు అంతే. ఇంక “సరిపోదా శనివారం” లాంటి సినిమాలైతే మావోడికి అర్థం కూడా కాదు.
కల్కి సినిమాలో నేనున్నాను అని వచ్చిన వార్తలన్నీ రూమర్లే..
ప్రభాస్ “కల్కి” సినిమాలో నేనేదో కీరోల్ ప్లే చేస్తున్నాను అని చాలా మంది చాలా రకాల వార్తలు పబ్లిష్ చేశారు. అయితే.. ఆ విషయంలో నేను రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం అన్నీ విషయాలకి రెస్పాండ్ అవ్వాలనుకోకపోవడమే. అయినా.. ఈమధ్య మీడియా కూడా వార్తలను క్రాస్ చెక్ చేసుకోకుండా రాసేస్తున్నారు, ఇక నేను అన్నిటికీ రెస్పాండ్ అవ్వడం మొదలెట్టానంటే.. ఎప్పుడైనా బిజీగా ఉండి రెస్పాండ్ అవ్వకపోతే.. నిజమే అనుకుంటారు. అందుకే ఎవాయిడ్ చేస్తున్నాను.