కరోనా.. అన్ని రంగాలను కుదిపేసింది. ముఖ్యంగా సినీ రంగానికి వందల కోట్లలో నష్టాలను తెచ్చిపెట్టింది. కేవలం షూటింగ్ ల ద్వారా వచ్చే డబ్బుల పైనే ఆధారపడి బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలను చాలా దెబ్బ తీసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కొంతమంది పెద్ద హీరోలు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్,బాలీవుడ్,మలయాళం పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోలు పేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ యష్ కూడా పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.
యష్ తనవంతుగా రూ.1.5 కోట్లను విరాళంగా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సినిమా పై వచ్చే డబ్బుల పై ఆధారపడి.. ఇప్పుడు పని లేక డబ్బు లేక అల్లాడుతున్న 3000 మంది కార్మికుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపాడు. తన సోషల్ మీడియా ద్వారా యష్ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘నేనేదో భారీగా ఇస్తున్నాను అని చెప్పుకోవడం లేదు. నేను ఇచ్చే దాంతో పేద సినీ కార్మికుల కష్టాలు తీరిపోతాయి అని నేను అనుకోవడం లేదు.కానీ నా వంతుగా ఎంతో కొంత ఇస్తే.
.
వారికి కొంచెమైనా ఉపయోగపడుతుంది అని నా భావన. కచ్చితంగా ముందు ముందు మంచి కాలం ఉంటుంది. అదే ధైర్యంతో ఉండండి.! మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చాడు యష్.ఇక యష్ నటిస్తున్న ‘కె.జి.ఎఫ్2’ చిత్రం త్వరలో విడుదల కానుంది.