“బిచ్చగాడు” చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన “భేతాళుడు, యమన్” చిత్రాలు పరాజయం పాలవ్వడంతో మళ్ళీ మంచి హిట్ కొట్టాలన్న ధ్యేయంతో తనకు బాగా అచ్చోచిన సెంటిమెంట్ యాంగిల్ లో తానే స్వయంగా రూపొందించి నటించిన చిత్రం “ఇంద్రసేన”. తమిళంలో “అన్నాదురై”గా రూపొందిన చిత్రానికి ఇది అనువాదరూపం. మరి విజయ్ ఆంటోనీ “ఇంద్రసేన”గా విజయం అందుకోగలిగాడా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : ఇంద్రసేన (విజయ్ ఆంటోనీ), రుద్రసేన (విజయ్ ఆంటోనీ) కవల పిల్లలు. ప్రేమించిన అమ్మాయి తన కళ్ల ముందే చనిపోవడంతో మందుకి బానిసై తన జీవితాన్ని పాడు చేసుకొంటుంటాడు ఇంద్రసేన. అన్నయ్యాలా కాకుండా పద్ధతిగా స్కూల్లో పి.టి మాస్టర్ గా ఉద్యోగం చేసుకుంటూ ఇష్టపడిన రేవతి (డయానా చంపిక)ను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సన్నద్ధమవుతుంటాడు. అంతా బానే ఉందనుకొంటున్న తరుణంలో.. ఇంద్రసేన ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కారణంగా ఏడేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. ఈ ఏడేళ్లలో తన కుటుంబంలో ఊహించని మార్పులు చోటు చేసుకొంటాయి. సమస్యల సుడి గుండంలో బ్రతుకుతుంటారందరూ. ఇదంతా తాను జైలుకి వెళ్ళడం వల్లేనని తెలుసుకొంటాడు ఇంద్రసేన. తన తప్పును సరిదిద్దుకోవడంతోపాటు.. తన కుటుంబ సమస్యలను ఎలా తీర్చాడానేది “ఇంద్రసేన” కథాంశం.
నటీనటుల పనితీరు : నేను మంచి నటుడ్ని కాను అని తానే స్వయంగా చెప్పుకొనే విజయ్ ఆంటోనీ.. ఈ సినిమాలోనూ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో నెట్టుకురావాలని విశ్వప్రయత్నం చేశాడు. అయితే.. అతడి పాత్ర వెయిటేజ్ ఎక్కువ కావడంతో ఆ క్యారెక్టర్ ద్వారా పండాల్సిన ఎమోషన్స్ సరిగా పండకపోవడంతో క్యారెక్టర్ ఎక్కువగా జనాలకి కనెక్ట్ అవ్వదు. హీరోయిన్లుగా నటించిన డయానా చంపిక, జ్యూయల్ మేరీ బొద్దుగా వెండితెర నిండుగా కనిపించారే కానీ.. నటన పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకోలేకపోయారు. ఇక మరో ముఖ్యపాత్రలో కనిపించిన మహిమ మాత్రమే నటన పరంగా అలరించింది. ఇంకా సినిమాలో బోలెడుమంది నటీనటులున్నప్పటికీ.. వారందరూ తమిళులు కావడం, సాగిన కథనంలో వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకుండాపోయింది.
సాంకేతికవర్గం పనితీరు : ఈ చిత్రానికి కథానాయకుడు/నిర్మాతతోపాటు సంగీత దర్శకుడు, ఎడిటర్ కూడా అయిన విజయ్ ఆంటోనీ ఒక్క నిర్మాతగా మంచి క్వాలిటీతో సినిమాని అందించడం వరకే విజయం సాధించి, మిగతా విభాగాల్లో బొటాబొటిగానూ పాసవ్వలేకపోయాడు. నేపధ్యం సంగీతం తమిళ సీరియల్స్ “పిన్ని, నమ్మకం”లలో టైటిల్ సాంగ్స్ ను తలపించగా.. పాటల్లో ఏ ఒక్కటీ సినిమా అయ్యాక గుర్తుంచుకొనే స్థాయిలో లేకపోవడం గమనార్హం.
దర్శకుడు జి.శ్రీనివాస్ కథను తన నిజ జీవితం నుంచి స్పూర్తి పొందడం వరకూ బానే ఉంది కానీ.. కథనాన్ని ఏదో మెగా సీరియల్ లా సాగదీసిన విధానం మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తుంది. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ఆడియన్స్ ఒక 20 నిమిషాల ముందే ఎక్స్ పెక్ట్ చేసిన తర్వాత కూడా సినిమాని సాగదీయడం, విషాదంతో సినిమాని ఎండ్ చేయడం అనేది మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం అయితే చాలా కష్టం. ముఖ్యంగా సినిమా మొత్తం ఆరవ సాంబార్ ఎక్కువగా ఉండడంతో ఉన్న రెండు మూడు మంచి సన్నివేశాలను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. అసలు.. స్టోరీ మొత్తానికి గృప్పింగ్ కాన్ఫ్లిక్ట్ ఒక్కటి కూడా లేకపోవడం చివరివరకూ సినిమాని సింగిల్ పాయింట్ తో సాగదీయడం అనేది పెద్ద మైనస్.
విశ్లేషణ : తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం, కుటుంబం కోసం కొడుకు త్యాగం కాన్సెప్ట్ లో ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో వందల కొద్దీ సినిమాలోచ్చాయి. ఏమాత్రం కొత్తదనం లేదా సెంటిమెంట్-ఎమోషన్ ఉన్నా “ఇంద్రసేన” కనీస స్థాయి విజయం అయినా సాధించి ఉండేది, కానీ కథనం సీరియల్ వలె సాగడం, కథలో ఆకట్టుకొనే అంశం ఒక్కటీ లేకపోవడంతో “ఇంద్రసేన” విజయ్ ఆంటోనీకి మరో ఫ్లాప్ అనే చెప్పాలి. రెగ్యులర్ హీరోస్ లా కాకుండా చాలా ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన విజయ్ ఆంటోనీ ఈ తరహా రొటీన్ కథాంశాలు కాకుండా కాస్త విభిన్నమైన కథలు ఎంచుకొంటే తప్పకుండా విజయం సాధిస్తాడు. లేదంటే ఇలాగే “ఇంద్రసేన”లా గురువారం వచ్చి ఆదివారానికల్లా కనుమరుగైపోతాడు.