సినిమాల కోసం ఎంత ఖర్చు పెడతారో అంతకుమించి వెబ్ సిరీస్ ల కోసం ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఓటీటీ సంస్థలు ఈ వెబ్ సిరీస్ ల నిర్మాణానికి సపోర్ట్ చేస్తున్నాయి. క్యాస్టింగ్, క్వాలిటీ, టెక్నికల్ టీమ్ ఇలా ఏ విషయంలో రాజీ పడడం లేదు. సబ్స్క్రైబర్స్ కి బెటర్ క్వాలిటీ కంటెంట్ అందించడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘సుడల్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది.
2017లో మాధవన్,విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన ‘విక్రమ్ వేద’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాను పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ రీమేక్ తో పాటు ‘సుడల్’ వెబ్ సిరీస్ స్టోరీ రాసుకున్నారు. అయితే దీని దర్శకత్వ బాధ్యతల బ్రహ్మ-అనుచరణ్ లకు అప్పగించారు.
నిన్న విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. తప్పిపోయిన తన చెల్లిని వెతికే ప్రయత్నంలో హీరోయిన్ కి గ్రామంలో జరిగే ఆచారాలు, అక్కడి ఫ్యాక్టరీ స్థితిగతులపై అనుమానాలు వస్తాయి. వాటిని దాటుకొని తన చెల్లెల్ని ఎలా కనిపెట్టిందో ఈ సిరీస్ కథ.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. జూన్ 17 దీని మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, కతిర్, శ్రేయ రెడ్డి ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.