అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – కమల్ హాసన్ (Kamal Haasan) – ప్రభాస్ (Prabhas) – దీపికా పడుకొణె (Deepika Padukone).. ఈ నలుగురిని ఒకే స్టేజీ మీద చూస్తే ఎంత బాగుంటుందో కదా? మొన్నీమధ్య ఈ ఆనందం ముంబయి వాసులకు మాత్రమే దక్కింది. ‘ఏముంది త్వరలో తెలుగువాళ్లకు కూడా ఆవకాశం దక్కుతుంది.. ఇక్కడ కూడా ఈవెంట్ ఉందట’ అని అందాం అనుకుంటున్నారా? అయితే ఆగండి. ఎందుకంటే మన దగ్గర ఈవెంట్ లెక్క ఇంకా తేలలేదు. అవును మీరు చదివింది నిజమే.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా ప్రచారం షెడ్యూల్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయి అని అంటున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో వివిధ పనులు ఇంకా పెండింగ్ ఉన్నందున దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఇటీవల ముంబయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని కూడా సమాచారం వస్తూ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ఈవెంట్ ఉంటుందా లేదా అనే డౌట్ మొదలైంది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈ ఈవెంట్ ఉంటుంది అని కూడా అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ అలాంటి ఆలోచనే లేదు అని చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో ఆ కార్యక్రమం ఉండొచ్చు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ తర్వాత అది ప్రెస్ మీట్‌కి పరిమితం అని కూడా అన్నారు.
జూన్ 27న సినిమా విడుదల కాబట్టి ఈ లోపే ఈవెంట్ చేయాలి. దీని గట్టిగా ఐదు రోజులే ఉంది. ఈ దిశగా అయితే టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం ఏమన్నా ఈవెంట్ ఉంటుందేమో అని అంటున్నారు. అయితే ముంబయి ఈవెంట్ పెట్టినప్పుడు ‘చాప్టర్ ముంబయి’ అని రాశారు. అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ఉండాలి. మరి ఈ ఐదు రోజుల్లో టీమ్ ఏమేం చేస్తుందో చూడాలి.