‘ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి’ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుష్కర రామ్ మోహన్ రావు నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ధనుష్ కు తెలుగులో స్ట్రైట్ మూవీ కూడా ఇదే అని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ ప్రాజెక్టుకి ముందుగా ధనుష్ ను హీరోగా అనుకోలేదట. మరో స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే ఆ ప్లేస్ లోకి ధనుష్ వచ్చి చేరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుని వద్దనుకుంది మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల శేఖర్ కమ్ముల పవన్ కోసం ఓ కథని రెడీ చేసుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని లైన్ .. పవన్ కు వినిపించగా అది అతనికి నచ్చింది. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట శేఖర్ కమ్ముల.
అయితే పవన్ డేట్స్ ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేవు. ‘అయ్యప్పనుమ్ కోషియం’ ‘హరి హర వీర మల్లు’, హరీష్ శంకర్ తో ఓ ప్రాజెక్టు.. ఇవి ఫినిష్ చేయాల్సి ఉంది. ‘దీంతో తర్వాత చూద్దాం’ అని శేఖర్ కమ్ములకి చెప్పాడట పవన్. ఈ క్రమంలో ధనుష్ కు ఈ కథ వినిపించగా అతను వెంటనే ఓకే చెప్పాడట. ఏమైనా ఓ మంచి కాంబో మిస్ అయిపోయిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి..!