‘బై లాస్’ మార్చను అంటే… అప్పుడు ‘మా’కు చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటాను అని మొన్నీ మధ్య ప్రకాశ్‌రాజ్ ఓ మాట అన్నారు గుర్తుందా? ఆయన ఆ రోజు ఆ మెలిక ఎందుకు పెట్టారు అనేది అర్థం కాకపోయుండొచ్చు కొందరికి. అక్కడి కొద్ది రోజులకు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ‘బైలాస్’ మారుస్తాం అని పక్కాగా చెప్పాడు. అయితే ఏమేం మారుస్తారు అనేది తెలియదు కానీ… అందులో పరభాషా నటులు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదు అని మాత్రం ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇది అంత సులభమా? చూద్దాం!
మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఈ సారి నాన్ లోకల్ ఇష్యూ వచ్చింది. కర్ణాటక నుండి వచ్చిన ప్రకాశ్‌రాజ్ ఇక్కడ ఎలా పోటీ చేస్తారు అని విష్ణు ప్యానల్, నరేశ్ ప్రశ్నించారు. దానికి కోట శ్రీనివాసరావు, రవిబాబు లాంటివాళ్లు మద్దతు పలికారు. అయితే ‘మా’లో సభ్యత్వం ఇవ్వడానికి, సినిమాల్లో నటించడానికి లేని ప్రశ్న… ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వచ్చిందా అంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్, నాగబాబు లాంటి వాళ్లు అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు ఏమన్నా తెలుగు వారా… అంటూ జీవిత ప్రశ్నించారు.
అయితే ‘మా’ సభ్యులు ఏ విషయాలు పరిగణలోకి తీసుకున్నారో తెలియదు కానీ, విష్ణునే గెలిచాడు. ఈక్రమంలో బైలాస్ మార్పు అంశం చర్చకు వచ్చింది. అయితే.. బైలాస్ మార్చడం అంత సులభం కాదంటున్నారు నిపుణులు. టాలీవుడ్ పెద్దలంతా కలసి తీసుకోవాల్సిన నిర్ణయమది. పరాయి భాష నుంచి వచ్చిన వాళ్లు `మా` సభ్యులుగా ఉండొచ్చు గానీ, అధ్యక్షుడిగా పోటీ చేయకూడదు అనే నిబంధన ఎంతవరకు సహేతుకం అనేది చర్చకు వస్తుంది. అప్పుడు ఎవరేమంటారు అనేది చూడాలి.
మోహన్‌బాబు – విష్ణు – నరేశ్ మాత్రం ఈ విషయంలో గట్టిగా ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో బైలాస్ మార్చాల్సిందే అనుకుంటున్నారట. దీని కోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి… తమ ఆలోచన చెప్పబోతున్నారట. ఈ క్రమంలో ఓటింగ్ కూడా నిర్వహించే ఉద్దేశం ఉందట. ఎన్నికలు అంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని డబ్బులు ఖర్చు పెట్టించి తీసుకొచ్చారు. ఇప్పుడు మీటింగ్‌కి వచ్చి ఓటింగ్ పాల్గొంటారా అనేది చూడాలి. రెండోది ఇండస్ట్రీ పెద్దలు ఈ వ్యవహారంలో ఎటువైపు వెళ్తారు అనేది చూడాలి. అయితే ఇదంతా ఈజీ కాదనేది పరిశీలకుల మాట.