ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ సినిమా అభిమానులందరికీ విపరీతంగా నచ్చేసిన చిత్రం “96”. ఆ స్వచ్చమైన ప్రేమకథకు తెలుగు రీమేక్ గా రూపొందిన చిత్రం “జాను”. సమంత టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శర్వానంద్ కథానాయకుడిగా నటించగా.. ఒరిజినల్ ఫిలిమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించారు. మరి తమిళనాట క్రియేట్ అయిన మేజిక్ తెలుగునాట రిపీట్ అయ్యిందో లేదో చూద్దాం..!!
కథ: పదిహేడేళ్ళ తర్వాత స్కూల్ రీయూనియన్ ఫంక్షన్లో కలుసుకున్న ప్రేమ జంట కె.రామచంద్ర అలియాస్ రామ్ (శర్వానంద్) & జానకి దేవి అలియాస్ జాను (సమంత). ఒకరంటే ఒకరికి చెప్పుకోలేనంత ఇష్టం ఉన్నప్పటికీ.. ఒకరితో ఒకరు చెప్పుకోకపోవడంతో కలవలేకపోతారు. విఫల ప్రేమ అనంతరం ఫోటోగ్రాఫర్ గా మారిన రామ్, పెళ్లి చేసుకొని సింగపూర్ లో స్థిరపడిన జానులు కాసేపు ఏకాంతంగా కాలం గడపాలనుకుంటారు. ఆ చిన్నపాటి ప్రయాణం వాళ్ళకెన్ని మధుర క్షణాలను నెమరువేసుకొనే అవకాశం ఇచ్చిందో వెండితెరపై “జాను” చిత్రంలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: నటీనటుల పనితీరును రెండు రకాలుగా పేర్కొనవచ్చు..
1) 96 సినిమాను కనీసం నాలుగైదుసార్లు చూసినవారి అనుభూతి:
అప్పటివరకూ మాస్ సినిమాలు, డిఫరెంట్ రోల్స్ చేసి ఉన్న విజయ్ సేతుపతిని సిన్సియర్ & సెన్సిబుల్ లవర్ రోల్లో చూడడం అదే మొదటిసారి. అందుకే విజయ్ క్లీన్ షేవ్ తో త్రిష ముందు సిగ్గుపడుతుంటే చూడడానికి కొత్తగా అనిపించింది. కానీ.. శర్వానంద్ ఇప్పటికే “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” తరహా సినిమాలు చేసి ఉన్నాడు. అందువల్ల శర్వా నటన కొత్తగా అనిపించదు. కాకపోతే.. రామ్ పాత్రను నిజాయితీతో పోషించాడు. అతడి పాత్రలోని నిజాయితీ శర్వా కళ్ళల్లో కనిపిస్తుంది.
ఇక త్రిషను అల్ట్రా గ్లామరస్ & కమర్షియల్ సినిమాల్లో చూసీ చూసీ ఉన్న ప్రేక్షకుడు ఒక్కసారిగా నిండైన బట్టలతో చక్కగా బొట్టు పెట్టుకొని వెండితెరపై కనిపించిన త్రిషను చూసి ఆశ్చర్యపోవడమే కాదు.. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి అవాక్కయ్యారు. అందుకే విజయ్ సేతుపతికంటే త్రిష నటిగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అయితే.. సమంత ఆల్రెడీ “మహానటి, ఓ బేబీ, ఎటో వెళ్లిపోయింది మనసు” వంటి సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది. అందువల్ల “జాను” సినిమాలో ఆమె వస్త్రధారణ కానీ.. అద్భుతంగా పలికించే హావభావాలు కూడా ఆశ్చర్యపరచవు.
2) 96 చూడకుండా.. జాను చిత్రాన్ని మొదటిసారి చూసినవారి అనుభూతి:
మనసులో అగాధాన్ని బయటకు కనిపించనివ్వకుండా స్థబ్దతతో క్రమశిక్షణతో, ఒద్దికతో బ్రతికే ఓ మధ్య వయస్కుడు కె.రామచంద్ర పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. ప్రతి విఫల ప్రేమికుడు శర్వా పాత్రకు కనెక్ట్ అవుతాడు. ఎమోషనల్ సీన్స్ లో శర్వా తన నటప్రతిభను మరోసారి ఘనంగా చాటుకొన్నాడు. శర్వానంద్ కెరీర్లో “జాను” ఒక స్పెషల్ సినిమాగా మిగిలిపోతుంది. శర్వా వాయిస్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. అతడి గొంతులో పలికే ప్రతి మాట, చెప్పే ప్రతి కవితలో బాధ, ప్రేమ, స్వచ్ఛత పెల్లుబుకుతుంది.
తెలుగు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన సమంతకు జాను పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం పెద్ద ఇబ్బందికరమైన పనేమీ కాదు. పైపెచ్చు ఈ తరహా పాత్రలు ఆమె ఇదివరకే పోషించింది. అయితే.. తన కెరీర్లో ఇదే బెస్ట్ సినిమా & పెర్ఫార్మెన్స్ అని సమంత పేర్కొనడం కాస్త అతిశయోక్తి. కానీ.. సమంత ముఖంలోని నిర్మలత్వం, ఆమె పాత్రలో ప్రస్పుటిస్తుంది. ఈ పాత్రలో సమంత కాకుండా మరో నటిని ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకే దిల్ రాజు పట్టుబట్టి మరీ ఈ పాత్రను సమంతతో పోషింపజేశాడేమో అనిపిస్తుంది.
స్నేహితుల పాత్రల్లో వెన్నెలకిషోర్, “ఫిదా” ఫేమ్ శరణ్య, వర్ష బొల్లమ్మ, తాగుబోతు రమేష్, రఘుబాబు లు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: గోవింద్ వసంత సంగీతం, మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం సినిమాకి మేజర్ ఎస్సెట్స్. గోవింద్ వసంత సంగీతం సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేస్తుంది. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం కంటికి ఇంపుగా ఉంటుంది. మిర్చి కిరణ్ సంభాషణలు మనసుకి హత్తుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తమిళ వెర్షన్ కంటే బాగున్నాయి. ప్రేమ్ కుమార్ తన మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నించాడు. ముందు చెప్పినట్లుగా “96” చూడనివారికి “జాను” ఒక అందమైన ప్రేమకావ్యం, చూసినవారికి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్. దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరపై పండించిన స్వచ్చమైన భావాలు మరియు సందర్భాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. వాటికోసమైనా సినిమాను థియేటర్ లో ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది. కాకపోతే.. 96లో కనిపించిన మ్యాజిక్ మాత్రం ఇక్కడ అంతగా వర్కవుట్ అవ్వలేదు.
విశ్లేషణ: “96”తో కంపేర్ చేయకుండా ఆనందంగా ఒకసారి చూడదగిన చిత్రం “జాను”. శర్వానంద్-సమంతల కెమిస్ట్రీ కోసం, స్వచ్చమైన ప్రేమకు ప్రతిరూపంలాంటి “జాను” అందరికీ కనెక్ట్ అవుతుంది. కాకపోతే.. సినిమా మరీ మెల్లగా ఉంటుంది కాబట్టి కాస్త ఓపికతో ఉండాలి అంతే.