‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు వీటీవీ గణేశ్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య జరిగిన ఓ సీరియస్ సరదా ఘటన గుర్తుందా? విజయ్ హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమా గురించి వీటీవీ గణేశ్ ప్రస్తావిస్తూ ‘భగవంత్ కేసరి’ సినిమా గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి జోక్యం చేసుకొని ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయేలా చేశారు. కానీ ఆ రోజు అనిల్ రావిపూడి చేసింది క్లియరెన్స్ కాదని.. కవరింగ్ అని ఇప్పుడు అర్థమవుతోంది.
విజయ్ – పూజా హెగ్డే – మమితా బైజు కాంబినేషన్‌లో హెచ్.వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమాను తెలుగులో ‘జన నాయకుడు’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. అందులో విజయ్, పూజ, మమితి కనిపించారు. ఆ మధ్య వచ్చిన టీజర్‌లో విజయ్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించాడు. ఇదంతా చూస్తుంటే ‘భగవంత్ కేసరి’ వైబ్స్ పక్కాగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ రోజు వీటీవీ గణేశ్ చెప్పిందే నిజం అనిపిస్తోంది.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘భగవంత్ కేసరి’ సినిమాలోని మెయిన్ పాయింట్ తీసుకుని దర్శకుడు మార్పులు చేసి తమిళనాడు రాజకీయాల ప్రస్తావనతో రూపొందించారట. వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో వీటీవీ గణేశ్ మాట్లాడుతూ విజయ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని అనిల్ అనిల్ రావిపూడి రిజెక్ట్ చేశారని తెలిపారు.‘భగవంత్ కేసరి’నే ఆ సినిమా అని చెప్పారు గణేశ్.

ఆయన ఈ మాటలు చెబుతున్నప్పుడే అనిల్ రావిపూడి కలగజేసుకొని ఆ విషయంపై మాట్లాడవద్దని గణేశ్‌ని కోరారు. ఇది ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని, దాని గురించి తర్వాత మాట్లాడదామన్నారు. తాను రీమేక్ చేయనని చెప్పలేదని, తమ మధ్య వేరే విషయం గురించి చర్చ జరిగిందని అనీల్‌చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తుంటే ఆ సినిమానే ఈ సినిమా అనిపిస్తోంది. క్లారిటీ రావాలంటే వచ్చే జనవరి 9 రావాల్సిందే. సినిమా రిలీజ్ కావాల్సిందే.
