తెరమీద ఒంటి చేత్తో అవలీలగా వందమందిని మట్టి కరిపించే హీరోలని అభిమానించే వీరాభిమానులు ఎందరో ఉంటారు. తమ ఫేవరెట్ యాక్టర్ సినిమా రిలీజ్ అప్పుడు కటౌట్స్ కట్టడం, పాలు, పూలతో అభిషేకాలు చేయడం, పుట్టినరోజు అప్పుడు పండ్లు పంచడం, రక్త దానాలు చెయ్యడం.. తమ అభిమాన హీరోని కలవడానికి వందలాది కిలోమీటర్లు పాద యాత్రలు చేయడం లాంటి సంఘటనలు చాలానే చూశాం.. కానీ తమ హీరోలు, తోటి అభిమానులు కూడా తాము చూపుతున్న అభిమానానికి కూడా అభిమానులయ్యేలా మంచి పనులు చేసే వాళ్లు మాత్రం చాలా అరుదు..
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తన మంచి మనసుని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జానీ అలియాస్ జనార్దన్ ఎన్నారై.. తను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి డైహార్డ్ ఫ్యాన్.. 50 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. అది కూడా తనకున్న అనారోగ్య సమస్యను లెక్క చెయ్యకుండా.. యూఎస్‌లో ఉండే జనార్దన్ క్యాన్సర్ రోగుల కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీని కోసం ఆఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుని..
50 ఏళ్ల వయసు గురించి, తనకున్న షోల్డర్ ఆర్థరైటిస్ గురించి ఆలోచించకుండా.. కేవలం 30 శాతం మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉండే కిలిమంజారోపై టెంపరేచర్ మైనస్ డిగ్రీల్లో ఉన్నా కూడా లెక్క చెయ్యకుండా.. 7 రోజుల్లో అధిరోహించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.. తానా, బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించినట్లు జనార్దన్ తెలిపారు. చాలా మంది స్పందించి కోటి రూపాయల వరకూ ఫండ్స్ ఇచ్చారని అన్నారు. ఆ డబ్బుతో క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం కావల్సిన ఎక్విప్‌మెంట్ కొన్నట్లు తెలిపారు.
రెండేళ్లలో వేరే ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నానని.. ఈసారి ఒకే హాస్పిటల్‌కి కాకుండా వివిధ హాస్పిటల్స్ కోసం ఫండ్స్ రైజ్ చేద్దామని అనుకుంటున్నట్లు.. అలాగే గుండె జబ్బులు ఉన్న చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు.. తెలంగాణలో చేసినట్టే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించున్నానని.. 2024 డిసెంబర్ కల్లా 2 కోట్లు ఫండ్స్ రైజ్ చేసి పలు హాస్పిటల్స్‌లో పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తామని అన్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన వచ్చాక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ని మరో స్థాయికి తీసుకెళ్లారని అన్నారు జనార్దన్. ఆయన చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు..