వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ కొంతకాలంగా కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఎందుకు తిరుగుతుందంటే.. 2008 లో కాజల్ అగర్వాల్ వివిడి కొబ్బరి నూనె సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ ప్రకటనను ఒక ఏడాదే ప్రసారం చేస్తామని చెప్పిన వివిడి ఇప్పటికీ వాడుతూనే వుంది. దీనిపై కాజల్ అగర్వాల్ కోర్టులో కేసు వేసింది. తాను నటించిన ప్రకటనను కేవలం ఏడాది పాటు మాత్రమే వాడుకోవాలనీ, కానీ వివిడి మాత్రం ఏడాది ముగిసినా ఇంకా వాడుకుంటూనే ఉందని పిటిషన్ వేసింది. ఇలా వాడుకుంటున్నందుకు తనకు 2.5 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. విచారణ జరిపిన చెన్నైలోని ప్రత్యేక కోర్టు కాజల్ పిటిషన్ ను కొట్టివేసింది.
ప్రకటనదారుడికి ఏదేని ప్రకటనను 60 ఏళ్లపాటు వాడుకునే హక్కు ఉంటుందని తెలిపింది. అయినా కాజల్ వెనక్కి తగ్గలేదు. మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం కాజల్ పిటిషన్ విచారణకు రాగా ప్రతివాదులు బదులు పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఈ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చే సింది. దాంతో న్యాయపోరాటం కొనసాగించడానికి కాజల్ కి గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో ఈ కేసుపై విచారణ మళ్ళీ మొదలు కానుంది.