మీరే వంట వండి.. బాగుంది అని మీకు మీరే కితాబు ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంకోలా చెబుదాం. సెంచరీ కొడదాం అనుకుని గ్రౌండ్‌లోకి దిగి 10 పరుగులకు ఔటై వస్తే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు కోచ్ ఇస్తే ఎలా ఉంటుంది. చూడటానికి చాలా బాగోదు కదా. అచ్చంగా ఇలాంటిదే జరిగింది ఈ ఏడాది సైమా వేడుకలో. సౌత్ సినిమా వాళ్లకు ఏటా ప్రత్యేకంగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో సైమా టీమ్ ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కి ఓ పురస్కారం ఇచ్చారు. ‘తలైవి’ సినిమాలోని నటనకుగాను కంగనా రనౌత్‌కి ఆ పురస్కారం లభించింది. ఏంటీ.. ఆ సినిమాలో కంగనకు పురస్కారం ఇవ్వకూడదా అంటారా. ఆ మాట ఎవరూ అనరు. అయితే ఎవరు నిర్మించిన సినిమాలో నటికి వారు అవార్డు ఇచ్చుకోవడం సరికాదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ‘తలైవి’ నిర్మాతలు. ‘సైమా’ పురస్కారాలు ఇచ్చే వాళ్లే. అందుకే సోషల్ మీడియాలో సైమా మీద జోకులు పేలుతున్నాయి.
నిజానికి ‘తలైవి’ సినిమా ఆశించిన మేర విజయం దక్కించుకోలేదు. జయలలితగా కంగన ఏమాత్రం సరిపోలేదు అని కూడా విమర్శలు వచ్చాయి. అలాంటి సమయంలో ఆమెకు పురస్కారం ఇవ్వడం మరో విశేషం. నిజంగా ప్రజల ఓటింగ్‌తోనే ఆమెకు పురస్కారం ఇచ్చారా అనేది ఓ డౌట్. ఈ క్రమంలో ఈ సినిమాకుగాను కంగనకు మరిన్ని అవార్డులు వచ్చే అవకాశం ఉంది అంటూ జోకులు కూడా పేలుతున్నాయి. త్వరలో ప్రకటించే జాతీయ పురస్కారాలు, పెద్ద పెద్ద అవార్డులు కూడా కంగనకు ఆ సినిమాకు వస్తాయి అంటున్నారు.
అన్నట్లు సైమా ఉత్తమ నటి (తమిళం) నుండి ఈ ఏడాది పోటీలో ఎవరున్నారు అనేది కూడా చూసేయండి. ‘తలైవి’ నుండి కంగనా రనౌత్, ‘నెట్రికన్’ నుండి నయనతార, ‘జై భీమ్’ నుండి లియోమోల్ జోజ్, ‘అన్బిర్‌కినియాల్’ నుండి కీర్తి పాండియన్, ‘తిట్టమ్ ఇరండు’ నుండి ఐశ్వర్య రాజేష్ పోటీలో నిలవగా కంగనకు ఆ పురస్కారం లభించింది.