సూర్య (Suriya) ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా (Kanguva) చిత్రం ఫైనల్ గా నెగిటివ్ రిజల్ట్ ను అందుకుంటోంది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు పెట్టుకున్న నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతూ ఉన్నాయి. కంగువా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సాధిస్తుందని ఊహించినవారు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా సూర్య మార్కెట్‌పై ప్రత్యక్షంగా ప్రభావం చూపినట్లు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
Kanguva
కంగువా పరాజయం కారణంగా, సూర్యకు ప్రతిష్టాత్మకంగా ఉండబోయే మరో ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితికి చేరుకుంది. దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, సూర్యతో కలిసి 600 కోట్ల బడ్జెట్‌తో కర్ణ కథను తెరకెక్కించాలని అనుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కంగువా డిజాస్టర్ తర్వాత ప్రాజెక్ట్ బడ్జెట్ తగ్గించాలని సూచించిందట. అయితే, దర్శకుడు ఈ మార్పుకు పూర్తిగా అంగీకరించలేదని తెలుస్తోంది.
ఈ డిస్కషన్లతో ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. కంగువా బ్లాక్ బస్టర్ అయ్యుంటే, ఈ ప్రాజెక్ట్ బడ్జెట్‌పై ఎలాంటి చర్చ ఉండేదే కాదని పరిశ్రమలోని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం కంగువా ఇచ్చిన నెగటివ్ ఫలితం, సూర్యను మరింత జాగ్రత్తగా ఆలోచించేలా చేసిందని టాక్. ఇదే సమయంలో, కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా కూడా కంగువా ప్రభావంతో మార్కెట్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కర్ణలో నటించేందుకు సూర్య సుముఖంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ కథను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నా, ఇప్పుడు నిర్మాతలు ఆర్థిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రాజెక్ట్‌కు అవరోధంగా మారింది. మరి సూర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటరా లేదంటే మరొక పెద్ద హీరోను సంప్రదిస్తారా అనేది చూడాలి.