తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన రచనల్లో ‘కన్యాశుల్కం’ ఒకటి. ప్రసిద్ధ రచయిత గురజాడ వేంకట అప్పారావు రచించిన ఈ నవలను ఇప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. అందులో చెప్పిన అంశాలు ఇప్పటికీ సమాజంలో కనిపించడమే దానికి కారణం. అందులోని పాత్రలు ఇప్పటికీ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడో దగ్గర తారసపడటమే దీనికి కారణం అని చెప్పొచ్చు. అందుకే ఈ నవలను గతంలో సినిమా తీసి విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ‘కన్యాశుల్కం’ సినిమాగా మారబోతోంది.
టాలీవుడ్‌లో విలక్షణ దర్శకుడిగా పేరొందిన అవసరాల శ్రీనివాస్ ఈసారి ‘కన్యాశుల్కం’ నవలను భుజానికెత్తుకున్నారు. ఇందులో కీలకమైన గిరీశం పాత్రను తానే స్వయంగా పోషిస్తూ, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. అలా వంద ఏళ్లు దాటిన ఆ ప్రఖ్యాత నవలను మరోసారి వెండితెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, సావితి, సీఎస్‌ఆర్ ఆంజనేయులు, గుమ్మడి, సూర్యాకాంతం, ఛాయాదేవి ప్రధాన పాత్రల్లో పి.పుల్లయ్య తెరకెక్కించారు.
సినిమాలో గిరీశం –మధురవాణి.. కరకటశాస్త్రి – మధురవాణి మధ్య ట్రాక్స్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ సన్నివేశాలను అవసరాల ఎలా తెరకెక్కిస్తారు అనేదానిపైనే సినిమా లెక్క ఆధారపడి ఉంది. అయితే ఈ నవలలో ఉన్న కొన్ని సన్నివేశాల విషయంలో ఇప్పుడు కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటాయి. మరి సినిమాలోని వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సినిమాలో మరో కీలక పాత్ర అయిన మధురవాణి పాత్రను అంజలి చేయబోతోంది అని టాక్. ఇందులో సాయికుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తారని సమాచారం.
గిరీశం పాత్ర పోషించడం అంత ఈజీ కాదు, అలాగే మధురవాణి పాత్ర కూడానూ. మరి ఈ రెండింటినీ అవసరాల శ్రీనివాస్, అంజలి ఎంతమేరకు బలంగా పోషిస్తారు అనేదానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ శ్రుతి మించినా, ‘మనోభావాల’ బ్యాచ్ రంగంలోకి దిగిపోతారు. అసలే ‘బాయ్‌కాట్’ అంటూ ఓ కత్తి చంకలో పెట్టుకుని రెడీగా ఉంటున్నారు ఈ మధ్య.