ఓడలు బండ్లు అవ్వడం, బండ్ల ఓడలు అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఈ జాతీయం విషయం మీకు ఏమైనా డౌట్ ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను (Akshay Kumar) చూడండి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్‌లో అదే. ఒకప్పుడు ఏ సినిమా చేసినా, ఏ కథ ఓకే చేసినా సగటు విజయం కన్‌ఫామ్ అనేవారు. ఆయన సినిమా పూర్తి చేసేలోగా ఇతర హీరోలు కథ గురించి ఇంకా చర్చల్లోనే ఉండేవారు అనేవారు. అలా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వచ్చారు.
కానీ ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన ఆయన సినిమాకు కూడా మంచి వసూళ్లు రావడం లేదు. కావాలంటే మీరే చూడండి ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) అంటూ ఇటీవల ఆయన నుండి ఓ సినిమా వచ్చింది. ఆయన జస్టిస్ చెత్తూరు శంకరన్ నాయర్ అనే ప్రధాన పాత్రలో నటించారు. ఆర్.మాధవన్ (R.Madhavan), అనన్య పాండే (Ananya Panday) ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలైంది. మంచి స్పందన కూడా సంపాదించింది. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘కేసరి’ సినిమాకు ఇది సీక్వెల్.
జలియన్ వాలా బాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఆ ఘటన జరిగి 106 సంవత్సరాలు అయిన సందర్భంగా విడుదల చేశారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఘటన చుట్టూ సినిమా తిరుగుతుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమా చేసినా పెద్దగా ఎక్కడా ప్రచారం జరగలేదు. దీనికి కారణం ఆయన సినిమాలు రీసెంట్‌గా వచ్చి దారుణమైన ఫలితం ఎదుర్కోవడమే. అయితే ఈ సినిమాకు తొలుత నుండి మంచి రివ్యూలే వస్తున్నాయి. అక్షయ్ నటనకు, సినిమా టేకింగ్‌కు అందరూ ముగ్ధులవుతున్నారు.
కట్ చేస్తే సినిమాకు ఆశించిన వసూళ్లు రావడం లేదు అనేది ముంబయి సినిమా వర్గాల టాక్. సినిమా వచ్చి ఆరు రోజులైనా ఇంకా రూ.100 కోట్లు మార్క్‌కి టచ్ అవ్వలేదు. రూ.62 కోట్లు దగ్గరే ఆగిపోయింది. దీంతో సినిమా బాగుందన్న వాళ్లు థియేటర్లకు వచ్చి చూడటం లేదు అందుకే వసూళ్లు నిరాశకలిగిస్తున్నాయి అంటున్నారు. ఇన్నాళ్లూ సినిమాల ఎంపిక విషయంలో అక్షయ్‌ను ఆడిపోసుకున్నవాళ్లు ఇప్పుడు ఆయనకు అవార్డు తెచ్చిపెడుతుంది అని చెబుతున్న ఈ సినిమాను ఎందుకు చూడటం లేదో వాళ్లకే తెలియాలి.