టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఎంత అద్భుతమైన నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో విలక్షణమైన పాత్రలను ఆయన అవలీలగా పోషించారు. వయసు మీద పడటంతో ఇప్పుడు కోటాకి అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడే మాటలు కూడా వివాదాస్పదమవుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కోటా శ్రీనివాసరావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.
ముఖ్యంగా బాపు- రమణ..ల గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఒకసారి నేను బాపు సినిమాలో ఎంపికయ్యాను. మొదటి రోజు షూటింగ్లో రమణ నా పక్కనే ఉన్నారు. ఆ టైంలో నేను డైలాగ్ చెప్పలేకపోతున్నాను. నేను ఇబ్బంది పడటం చూసిన రమణగారు నన్ను పిలిచారు. అప్పుడు నాకు కంగారు వచ్చింది. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు. ‘నాతో పాటు బాపు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు.
మేము.. నీ ఫ్యాన్సయ్యా ‘ అని అన్నారు. ఆయన మాట విన్నాక నాకు కళ్లంటా నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత ‘పద్మశ్రీ’ వచ్చినంత ఆనందమేసింది. బాపు గారి గురించి చెప్పాలంటే.. ‘తెలుగు చూడాలంటే బాపు .. తెలుగు వినాలంటే రమణ’ అని అన్నాను.ఆయన సినిమాల్లో హాస్యం ఇప్పటికీ బాగా అనిపిస్తుంది. అది నిజమైన హాస్యం .. ఇప్పుడున్నది కామెడీ. ఆ హాస్యం తల్లిపాలలాంటిది. ఇప్పుడున్న హాస్యం డబ్బా పాల వంటిది” అంటూ చెప్పుకొచ్చారు.