జాతీయ వ్యాప్తంగా గుర్తింపు రావడం ఎవరికైనా ఆనందదాయకమే. కానీ ఆ గుర్తింపు కొన్ని సమస్యలను కూడా వెంట తీసుకొస్తాయి. ప్రతి విషయాన్నీ ఆ వ్యక్తికి ముడి పెట్టడం జరుగుతుంటాయి. కొన్ని సున్నితమైన అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులను ప్రభాస్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. మీడియాతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ప్రభాస్ మోడీ కోసం బీజీపీ ప్రచారంలో పాల్గొంటారని అనేక పత్రికలూ ఊదరగొడుతున్నారు. ఈ వార్తలు సుజీత్ డైరక్షన్లో సాహో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ని కొంత ఆందోళనకు గురిచేశాయి. దాంతో అతని పెదనాన్న కృష్ణం రాజు స్పందించాల్సి వచ్చింది.
ప్రభాస్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనుమానాలు పటాపంచలు చేశారు. ” ప్రభాస్‌కు బీజేపీతో సంబంధం లేదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేసినా ప్రభాస్ ప్రచారానికి రాడు” అని స్పష్టం చేశారు. “ప్రభాస్ ఎదుగుతున్న నటుడు., మూడున్నరేళ్లు ఎంతో శ్రద్ధతో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. పదేళ్లతోనే సినిమా జీవితం అయిపోలేదు. ఇంకా పాతికేళ్లు నటించాల్సిన ప్రభాస్‌కు అప్పుడే రాజకీయాలు అవసరం లేదు” అని కృష్ణం రాజు వెల్లడించారు. ప్రభాస్‌ను ప్రధాని మోదీకి గతంలో కృష్ణంరాజు పరిచయం చేసిన విషయాన్ని విలేకరులు గుర్తు చేయగా.. పరిచయాలకు రాజకీయాలకు సంబంధం లేదని ఒక్కమాటలో కొట్టిపడేశారు.