బాగా తినేవాళ్లందరికీ.. బాగా వండటం రావాలని లేదు. అయితే కృష్ణంరాజు దీనికి వ్యతిరేకం. ఆయన బాగా తింటారు, అదే సమయంలో బాగా వండుతారు కూడా. అయితే ఆయన వంటల రుచిని.. నాలుకతో కాకుండా ముక్కుతో చూసేవారట. అదేంటి అనుకుంటున్నారా? అదే ఆయన స్టైల్. కూరలో ఉప్పు, కారం అనేవి నాలుకతో రుచి చూసి చెప్పడం కాదు, ముక్కుతో వాసన చూసి చెప్పేయొచ్చు అని అనేవారాయన. దీనికి సంబంధించి ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద రెండేళ్ల క్రితం ట్విటర్‌లో ఓ వీడియో పెట్టారు. అందులో కృష్ణంరాజు చేపల పులుసు వండుతూ కనిపిస్తారు. కూర టేస్ట్ చూసే క్రమంలో వాసన చూసి.. వావ్ అని అంటారు. ఆ తర్వాత ‘అదేంటి కూర రుచి వాసన చూసి చెబుతున్నా అనుకుంటున్నారా? కూర రుచి వాసనతో కూడా తెలుస్తుంది’ అని ఆయన అనడం. ఆ తర్వాత తనదైన శైలిలో ఓ నవ్వు నవ్వడం చూడొచ్చు. వంటలో, తిండిలో ఎక్స్‌పర్ట్ అయితేనే ఈ ప్రతిభ అలవడుతుంది.
“వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ప్రపంచంలో ఆయన్ని మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్‌పర్ట్” అని ప్రసీద ట్వీట్‌లో రాసుకొచ్చారు. కృష్ణంరాజును టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు ‘అన్నదాత’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సెట్‌లో ఉన్నారంటే.. ఆయనతోపాటు చాలామందికి తన ఇంటి నుండే భోజనం వస్తుంది కాబట్టి.
చిరంజీవి ఇంట్లో దోశలు బాగుంటాయని ఓసారి కృష్ణం రాజు చెప్పడంతో చిరంజీవి ఆయనకు దోశలతో పాటు రెండు రకాల చట్నీలు పంపించారట. వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తూ తిన్నారట కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణంరాజు ఇంట్లో వండిన బిర్యానీని చిరంజీవి పంపిన క్యారియర్‌లో పెట్టి వెనక్కి పంపించారట. ఆ బిర్యానీని చిరంజీవి మధ్యాహ్నం తిని, ‘మిగిలింది సాయంత్రం తింటాను ఉంచండి’ అని ఇంట్లో చెప్పారట. అలా భోజనం విషయంలో, వంట విషయంలో రాజు గారు.. రాజు గారే.